- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా 7 ESI ఆరోగ్య ప్రాజెక్టులు షురూ.. సనత్‌నగర్‌లో రూ.211 కోట్లతో అత్యాధునిక OPD బ్లాక్!
దేశవ్యాప్తంగా రూ.668 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్‌ఐ ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా రూ.668 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్‌ఐ (ESI) ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సనత్ నగర్ ఈఎస్ఐసీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆయనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. ఈ నూతన ప్రాజెక్టుల అందుబాటుతో దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అత్యాధునిక, మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ ప్రాజెక్టులలో భాగంగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రూ.211.13 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన నూతన ఓపీడీ (OPD) బ్లాక్‌ను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేలా ఈ కొత్త భవనాన్ని సర్వాంగ సుందరంగా, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు.
నూతన బ్లాక్‌లోని ప్రత్యేకతలు, వసతులు ఇలా..
కొత్త భవనంలో రోగుల కోసం 180 సాధారణ పడకలను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం 25 ఐసీయూ (ICU) పడకలతో పాటు, చిన్న పిల్లల అత్యవసర సంరక్షణ కోసం 20 ఎన్‌ఐసీయూ (NICU) పడకలను సిద్ధం చేశారు. రేడియాలజీ, మెడికల్ పునరావాస కేంద్రం (Rehabilitation Centre) వంటి ప్రత్యేక విభాగాలు ఇందులో అందుబాటులోకి వచ్చాయి. రోగుల మానసిక, శారీరక ఉల్లాసం కోసం ప్రత్యేకంగా యోగా సౌకర్యాలను కూడా ఈ కొత్త బ్లాక్‌లో కల్పించారు. దేశవ్యాప్తంగా ఈఎస్‌ఐ మౌలిక వసతుల బలోపేతానికి ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని, ముఖ్యంగా సనత్‌నగర్ ఈఎస్‌ఐ అందుబాటులోకి రావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువవుతుందని అధికారులు పేర్కొన్నారు.






