రాజకీయం పక్కనపెట్టి నీటి కష్టాలు తీర్చండి.. ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్

by Kema Shiva Kumar |

కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని తోడితేనే రాష్ట్రంలో రైతాంగానికి, ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

రాజకీయం పక్కనపెట్టి నీటి కష్టాలు తీర్చండి.. ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తాగు, సాగునీటి కష్టాలపై రాజకీయాలు పక్కనపెట్టి తక్షణమే పరిష్కారాలు చూపాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి (Singareni) సంస్థకు ‘తాడిచర్ల బ్లాక్-2’ బొగ్గు గనిని కేటాయించిన సందర్భంగా కార్మికుల్లో భరోసా నింపేందుకు బీజేపీ చేపట్టిన ‘సింగరేణి భరోసా యాత్ర’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న నీటి విధానాలు, సింగరేణిపై చేస్తున్న రాజకీయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా మేల్కొని కరువు హెచ్చరికలపై దృష్టి పెట్టాలని, రాజకీయ విమర్శలకు మాని సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌తోనే నీటి కష్టాలు తీరుతాయి..

అయితే, నీటి లభ్యత ఉన్న చోట నుంచి సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. కన్నెపల్లి పంప్‌హౌస్ (Kannepalli Pump House) ద్వారా నీటిని తోడితేనే రైతాంగానికి, ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని ఆయన స్పష్టం చేశారు. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే మేడిగడ్డ, ఇతర ప్రాజెక్టుల అంశంలో బురదజల్లే రాజకీయం చేస్తూ కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సింగరేణి అభివృద్ధికి కట్టుబడి ఉందనడానికి తాడిచర్ల బ్లాక్-2 కేటాయింపే నిదర్శనమని గుర్తుచేశారు. ఈ కేటాయింపు చేసింది కేంద్ర బొగ్గు గనుల శాఖ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదంటూ ఈటల సెటైర్లు వేశారు. సింగరేణిని దోపిడీ చేసిన ఘోరమైన చరిత్ర కాంగ్రెస్‌దేనని, వాస్తవాలను కార్మికులకు వివరించేందుకే తాము ‘సింగరేణి భరోసా యాత్ర’ చేపట్టామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Next Story