- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత పులుల మృతి పై అటవీ అధికారుల విచారణ..
ధర్పల్లి, భీంగల్ మండలాల్లోని రెండు చిరుత పులుల మృతి పై అటవీశాఖ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

దిశ, ధర్పల్లి : ధర్పల్లి, భీంగల్ మండలాల్లోని రెండు చిరుత పులుల మృతి పై అటవీశాఖ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. చిరుత పులుల కళేబరాలు ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ పాడుబడిన బావిలో లభించడంతో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో చిరుత పులి మృతి పై విచారణలో తీగలాగితే ధర్పల్లిలో డొంక కదిలింది. జంతువులను పట్టేందుకు వల వేసిన వేటగాళ్లకు వలలో చిరుతతో పాటు అడవి పంది చిక్కిందని సమాచారం. రామడుగు అటవీ ప్రాంతంలో కొందరు వేటగాళ్లు వల వేయడంతో చిరుత పులి, అడవి పంది వలలో చిక్కింది. చిరుతను చంపేసి దాని గోర్లు, దంతాలు, చర్మంను ఉంచుకొని దానికలేబరాన్ని తమ్మలోడి బాగులో ఓ పాడుబడిన బావిలో పడేశారు. పులిచర్మంను సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మరొక పాడుబడిన బావిలో పడేసినట్లు నిందితులు వివరించినట్లు తెలిసింది. చిరుత పులిని చంపి కళేబరాన్ని పడేసిన ధర్పల్లికి చెందిన ముగ్గురు ఎరుకల కులానికి చెందిన వారని తెలిసింది. చిన్నాచితక వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చి మాల గుట్ట పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు నిందితులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరొక నిందితుడు రామారెడ్డికి చెందిన వ్యక్తిగా అటవీ అధికారులు గుర్తించారు. నిందితుడి కోసం వెతకగా పరారీలో ఉన్నట్టు తెలిసింది. నిందితులు అడవి పందిని అమ్ముకున్నట్లు తెలిసింది. చిరుత పులిని చంపి మూడు నెలలు గడిచినా అటవీ అధికారులు గుర్తించకపోవడం నిర్లక్ష్యంను తెలియజేస్తుంది. కమ్మర్పల్లి రేంజి పరిధిలోని ఓ చిరుతను చంపి పూడ్చివేసిన ఘటన పై విచారణ జరుపుతుండగా మరొక సంఘటన ధర్పల్లిలో చిరుత మృతి బయటపడడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ధర్పల్లి మండలంలో అడవి పందులు, జింకలు, మనుబోతులు, కుందేళ్లు, వంటి జీవరాసులకు ఉచ్చులు వేసి చంపుతున్నారు. వీటి మాంసానికి బాగా గిరాకి ఎక్కువగా ఉండటంతో గ్రామంలో నడిబొడ్డున అమ్ముతున్న అటవీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం, అప్పటికప్పుడు స్మగ్లర్ వద్ద డబ్బులు నొక్కేయడం, లేదంటే కేసులు చేస్తామని బెదిరించడం వంటి అవినీతి సంఘటనలతో వన్యమృగాల వేట యదేచ్చగా సాగుతుంది. నిందితులను పట్టుకొని విచారించగా పులి మృతి కేసు పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సంఘటన ఎలా జరిగిందో నిందితులు చెప్పిన విషయాలను బట్టి అటవీ అధికారులు జాగిలాలతో విచారణ జరిపారు. చిరుతపులి ఎక్కడ వలవేసి పట్టుకున్నారో ఎలా చంపారు ఎక్కడ పడేశారు అనే విషయం పై ఇందల్ వాయి రేంజి ఆఫీసర్ రవి మహేష్ బట్ అటవీ సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించి పాడుబడిన బావుల చుట్టూ రిబ్బన్ చుట్టి గుర్తులు పెట్టారు. వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.






