మొక్కజొన్న కొనుగోళ్లలో ''సహకార'' దోపిడి

by Kodari Anjali |

రైతులకు అండగా నిలవాల్సిన సహకార సంఘమే కొందరి చేతుల్లో ఆదాయ వనరుగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మొక్కజొన్న కొనుగోళ్లలో సహకార దోపిడి
X

దిశ, ఇల్లెందు: రైతులకు అండగా నిలవాల్సిన సహకార సంఘమే కొందరి చేతుల్లో ఆదాయ వనరుగా మారిందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని, రైతులను అనేక రకాలుగా దోచుకుంటూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు పూర్తి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, దళారులతో కుమ్మక్కై తక్కువ ధరలకు మొక్కజొన్నను కొనుగోలు చేసి, ప్రభుత్వ ధరకు విక్రయించడం ద్వారా భారీ లాభాలు ఆర్జించారని రైతులు మండిపడుతున్నారు.

ఆన్‌లైన్ పేరిట ఒక్కో రైతు నుంచి రూ.1,000 వసూళ్లు

ప్రభుత్వం రైతుల కోసం పూర్తిగా ఉచితంగా అందించే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సైతం ఆదాయ మార్గంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో రైతు నుంచి రూ.1,000 వరకు వసూలు చేసినట్లు బాధిత రైతులు చెబుతున్నారు. ఆన్‌లైన్ సేవకు ఎలాంటి రుసుము లేకపోయినా, "ఇలా చేయకపోతే కొనుగోలు జరగదు" అంటూ రైతులను భయపెట్టి డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు.

బస్తాలకు సైతం డబ్బులు కటింగ్ చేసి

ఇక్కడితో ఆగకుండా ప్రతి బస్తాపై వివిధ పేర్లతో పైసలు కట్ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైతు నుంచి వందల రూపాయలు కోత విధించడం ద్వారా వేలాది బస్తాలపై భారీ మొత్తంలో అక్రమ వసూళ్లు జరిగినట్లు సమాచారం. ఈ కోతలకు ఎలాంటి అధికారిక రసీదులు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు.

రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు

మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ, రైతుల నుంచి క్వింటాలుకు రూ.500 నుంచి రూ.600 వరకు తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దళారులతో కుమ్మక్కై రైతుల నిర్భంద పరిస్థితిని ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు సరుకును తీసుకుని, అనంతరం ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి భారీగా లాభాలు గడించారని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ధరకు విక్రయించి రూ.లక్షల్లో లాభాలు

తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొక్కజొన్నను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి ధరకు విక్రయించడం వల్ల లక్షలాది రూపాయల అక్రమ లాభాలు వచ్చినట్లు సమాచారం. రైతుల చెమటను కొందరు తమ ఆదాయంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విక్రయించిన మొక్కజొన్న పైసల్లో సైతం కోత

మొక్కజొన్న విక్రయించిన తర్వాత కూడా రైతులకు పూర్తిస్థాయి చెల్లింపులు జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. "తేమ ఎక్కువగా ఉంది", "గింజలు పాడయ్యాయి", "నాణ్యత తక్కువగా ఉంది" వంటి కారణాలు చూపుతూ ఒక్కో రైతు నుంచి 10 నుంచి 20 కిలోల వరకు తగ్గించి చెల్లింపులు చేసినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు మరింత ఆర్థికంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి సొమ్ము పంపకాల్లో పలు అధికారుల అసహనం..?

ఈ మొత్తం వ్యవహారంలో అక్రమంగా వచ్చిన సొమ్ము పంపకాల విషయంలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయని, కొందరు అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామం వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారడానికి కారణమైందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.

అసహనం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధర రాకపోవడం, కొనుగోలు ప్రక్రియలో అనేక రకాల కోతలు విధించడం, ఆన్‌లైన్ పేరిట డబ్బులు వసూలు చేయడం వంటి ఘటనలతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటైన సహకార వ్యవస్థే తమను దోచుకుందని పలువురు రైతులు వాపోతున్నారు.

ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు

తమకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదులు ఇవ్వడంతో పాటు, అవసరమైతే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం కొనుగోలు ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story