ఏవో శ్రీహరి హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి కుటుంబం సామూహిక ఆత్మహత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-14 10:46:15  IST  )

ఏవో శ్రీహరి దారుణ హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.

ఏవో శ్రీహరి హత్యకేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుడి కుటుంబం సామూహిక ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన వ్యవసాయ అధికారి శ్రీహరి (Srihari) హత్యకేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. శ్రీహరిని కుక్కలను చంపే ఇంజెక్షన్‌‌తో దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అతడి సొంత బావమరిది హరికృష్ణ (Hari Krishna), తన కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి హరికృష్ణ తన భార్య, పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్పాట్‌లో దొరికిన ఆధార్‌ కార్డు ఆధారంగా అతడు హరికృష్ణేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

అయితే, బావను హత్య చేసిన అనంతరం చట్టానికి దొరికిపోతాననే భయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే హరికృష్ణ ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. సింగరాయకొండ (Singrayakonda) వద్ద వేగంగా వస్తున్న రైలు కింద పడి హరికృష్ణ, అతని భార్య, పిల్లలు ప్రాణాలు విడిచారు. ట్రాక్‌పై విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు స్పాట్‌కు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

కుక్కలను చంపే ఇంజెక్షన్‌తో శ్రీహరి హత్య..

కాగా, గత నెల 15న బుచ్చిరెడ్డిపాలెం మండల ఏవోగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిది హరికృష్ణ కుక్కలను చంపే మందు ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడు పరారీలో ఉండగా. ఏవో శ్రీహరి తన సొంత బావమరిది హరికృష్ణను నమ్మి సుమారు రూ.కోట్ల విలువైన ఆస్తిని అతనికి రాసివ్వగా.. అప్పుగా కొంత డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరి మంచి ఇళ్లు కట్టుకోవాలని ఉందని నేను ఇచ్చిన ఆస్తిని, డబ్బును తిరిగి ఇవ్వాలని హరికృష్ణను కోరారు. అయితే, డబ్బు తిరగి ఇవ్వమన్నందుకు బావను హత్య చేసేందుకు హరికృష్ణ పక్కా ప్లాన్ వేశాడు. అందుకు ఇందుకు మరో ఇద్దరి సాయం తీసుకున్నాడు. జూన్‌ 15న దైవదర్శనార్థం పెంచలకోనకు వెళ్లి వద్దామని నమ్మించి కారులో తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో కారు డ్రైవ్‌ చేస్తున్న హరికృష్ణ పథకం ప్రకారం చేజర్ల మండలం సమీపంలో అకస్మాత్తుగా ఆపారు. అప్పటికే కాపుకాసిన గొలగమూడికి చెందిన రవీంద్ర, రామతీర్థానికి చెందిన యానాదిలు కారు ఆపగానే శ్రీహరిని పట్టుకున్నారు. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజెక్షన్లు రెండు శ్రీహరికి వేయడంతో ఆయన గుండె ఆగిపోయింది.

గుండెపోటుగా చిత్రీకరణ..

ఆ తర్వాత శ్రీహరిది గుండెపోటుగా చిత్రీకరించి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సొంత ఊరు మినగల్లుకు తీసుకొచ్చారు. మృతి విషయం తెలిసిన తోటి ఉద్యోగులు మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వచ్చినా కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదు. తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల్లో భాగంగా సహజంగా పూడ్చాల్సి ఉన్నా కాల్చేశారు. ఇటీవల హరికృష్ణ.. శ్రీహరికి సంబంధించి మిగిలిన ఆస్తి తనకు రాసివ్వాలని ఘర్షణ పడడంతో ఆయన భార్య లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హరికృష్ణ కోసం తీవ్రంగా గాలిస్తున్న సమయంలో అతడి కుటుంబం ఇవాళ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.

Next Story