- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూర్గంపాడులో రేషన్ కష్టాలు..
బూర్గంపాడు మండలంలోని రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండలంలోని రేషన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా రేషన్ షాపుల్లో సర్వర్లు పని చేయకపోవడంతో బియ్యం పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నిరుపేదలు,కూలీ పనులకు వెళ్లే లబ్ధిదారులు ప్రతిరోజూ రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
పనులు మానుకొని దుకాణాల వద్దకే..
సర్వర్ సమస్య కారణంగా ఈ-పాస్ మిషన్లు పనిచేయడం లేదని, బొటనవేలి ముద్రలు పడటం లేదని డీలర్లు చెబుతున్నారు. రోజంతా వేచి చూసినా సర్వర్ రాకపోవడంతో లబ్ధిదారులు ఖాళీ సంచులతో వెనుతిరుగుతున్నారు. రోజువారీ కూలి పనులు మానుకొని రేషన్ కోసం వస్తున్నామని, తీరా ఇక్కడికి వచ్చాక సాంకేతిక సమస్యల వల్ల బియ్యం దొరకడం లేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
15వ తేదీ వరకే గడువా? లబ్ధిదారుల ఆందోళన
ఇదిలా ఉంటే,రేషన్ డీలర్లు చెబుతున్న మాటలు లబ్ధిదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నెలలో 15వ తేదీ వరకే రేషన్ బియ్యం ఇస్తాం,ఆ తర్వాత సర్వర్ ఓపెన్ కాదంటూ డీలర్లు స్పష్టం చేస్తుండటంతో లబ్ధిదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. జూలై 14వ తేదీ (ఈరోజు) నాటికే సమస్య సర్దుమణగకపోవడం, రేపటితో (15వ తేదీ) గడువు ముగుస్తుందని అనడంతో.. తమకు ఈ నెల బియ్యం అందుతాయా లేదా అనే అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. సాంకేతిక లోపాలు ప్రభుత్వానివైతే,ఆ శిక్ష మాకు వేయడం ఎంతవరకు న్యాయం? సర్వర్ సమస్యలను వెంటనే పరిష్కరించి, గడువు ముగిసినా సరే అర్హులైన వారందరికీ రేషన్ బియ్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా నిరుపేదల నోటికాడి కూడు దూరం కాకుండా, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సర్వర్ సమస్యను పరిష్కరించాలని, అలాగే రేషన్ పంపిణీ గడువును పొడిగించాలని బూర్గంపాడు మండల ప్రజలు కోరుతున్నారు.






