- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి
సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపిస్తూ బకాయిల విడుదలను డిమాండ్ చేశారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి సంస్థ అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గోదావరిఖనిలోని ఫైవ్ ఇంక్లైన్ గని ఆవరణలో నిర్వహించిన బీజేపీ భరోసా యాత్ర సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు సుమారు 1.2 లక్షల మంది కార్మికులతో ఉన్న సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 35 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. సింగరేణి అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా అంతర్గత విభేదాలతో కాలం గడుపుతోందని ఆరోపించారు.
135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు సకాలంలో అందక కార్మికుల జీతాలు చెల్లించేందుకు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి భవిష్యత్తు బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, తాడిచెర్ల బొగ్గు బ్లాక్–2ను నామినేషన్ విధానంలో సింగరేణికి కేటాయించామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి సింగరేణి సమస్యలను తీసుకెళ్లిన అనంతరం ఈ బొగ్గు బ్లాక్ కేటాయింపు జరిగిందని చెప్పారు.
సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు, వారి పిల్లలకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కేటాయించిందని ఆరోపిస్తూ, 118 బొగ్గు బ్లాకుల కేటాయింపులపై కాగ్, సుప్రీంకోర్టు, సీబీఐ విచారణలు జరిగాయని, ఆ కేసులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు జైలు పాలయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈటల రాజేందర్, మహేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, వెంకట్ రమణారెడ్డి, అంజిరెడ్డి, పాయల శంకర్, భూమాస్ శ్రీనివాస్‌తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






