​సోంపల్లి అడవుల్లో ‘పోడు’ కలకలం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు!

by Kodari Anjali |

బూర్గంపాడు మండలం సోంపల్లి ఫారెస్ట్ పరిధిలో అటవీ భూములు అంతరించిపోతున్నాయి.

​సోంపల్లి అడవుల్లో ‘పోడు’ కలకలం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఫారెస్ట్ అధికారులు!
X

దిశ​, బూర్గంపాడు: బూర్గంపాడు మండలం సోంపల్లి ఫారెస్ట్ పరిధిలో అటవీ భూములు అంతరించిపోతున్నాయి. ఇక్కడ యథేచ్ఛగా అటవీ భూములను ఆక్రమించి ‘పోడు’ కొడుతున్నా, పట్టించుకోవాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని అడవి కాస్తా క్రమక్రమంగా మైదాన ప్రాంతంగా మారిపోతుండటం పట్ల పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

​సమాచారం ఇచ్చినా స్పందించని బీట్ ఆఫీసర్!

​సోంపల్లి అటవీ ప్రాంతంలో గిరిజనులు పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తూ,భూములను చదును చేస్తున్న ఉదంతంపై స్థానికులు అక్కడి బీట్ ఆఫీసర్ శ్రీరాములకు సమాచారం అందించారు.అయితే, అడవులను కాపాడాల్సిన సదరు అధికారి సమాచారం అందినప్పటికీ క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడం, కనీసం స్పందించకపోవడం గమనార్హం. సమాచారం ఇస్తే అడ్రస్ లేకుండా పోయారంటూ స్థానికులు సదరు అధికారి తీరుపై మండిపడుతున్నారు.

​ముడుపుల మత్తులో క్షేత్రస్థాయి సిబ్బంది?

అటవీ భూముల అన్యాక్రాంతం వెనుక క్షేత్రస్థాయి సిబ్బంది హస్తం ఉందనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది భారీగా ముడుపులు (లంచాలు)తీసుకుని, అక్రమార్కులకు సహకరిస్తూ అటవీ భూములను లోపాయికారీగా అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల నిఘా లోపం వల్లే కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​నిత్యం పచ్చదనంతో కళకళలాడాల్సిన అటవీ ప్రాంతం, అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్కుల కాసుల కక్కుర్తి వల్ల క్రమంగా మైదానంగా మారుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సోంపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న పోడు సాగుపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని,అటవీ భూములను కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి సురేష్ దృష్టి తీసుకెళ్లగా పోడు కొట్టిన అటవీ భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story