అరైవ్ అండ్ అలైవ్‌తో రోడ్డు భద్రతే లక్ష్యం

by Batti.Sumithra |

రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా కోదాడ రూరల్ ఎస్సై షేక్ యాకూబ్ అన్నారు.

అరైవ్ అండ్ అలైవ్‌తో రోడ్డు భద్రతే లక్ష్యం
X

దిశ, కోదాడ : రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా కోదాడ రూరల్ ఎస్సై షేక్ యాకూబ్ అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో మంగళవారం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్థులు, వాహనదారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే "అరైవ్ అండ్ అలైవ్" కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, అందుకే ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

హెల్మెట్, సీట్‌బెల్ట్‌లు కేవలం చట్టపరమైన నిబంధనలు మాత్రమే కాకుండా, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలుగా పనిచేస్తాయని వివరించారు. అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ట్రిపుల్ రైడింగ్, అతివేగం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం రోడ్డు భద్రత పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story