ఆమ్లెట్ విషయంలో అత్తతో గొడవ.. ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య

by Taduka Kalyani |

శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఆమ్లెట్ విషయంలో అత్తతో గొడవ.. ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
X

దిశ వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబంలో జరిగిన గొడవ, అత్తింటి వేధింపులతో మనస్తాపానికి గురై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. బొడ్డేపల్లి గ్రామానికి చెందిన 26 ఏళ్ల షర్మిలకు ఏడాది క్రితం నాగరాజుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భర్తతో పాటు అత్త, మామ, మరిదితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల 8న భర్త ఉద్యోగం ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం షర్మిల భోజనం వడ్డించింది. భర్తకు ఆమ్లెట్ పెట్టిన సమయంలో పక్కనే భోజనం చేస్తున్న మరిదికి ఇవ్వలేదన్న విషయంపై అత్త దమయంతి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం గా మారిందని సమాచారం. గొడవ జరిగిన సమయంలో భర్త జోక్యం చేసుకోకపోవడంతో షర్మిల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, వేధింపుల కోణంలో దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Next Story