- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానదేవుడు కరుణించేనా?
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.

దిశ, తలకొండపల్లి: సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. రెండు నెలల క్రితం ఎంతో ఆశతో వేసిన పంటలు కళ్లముందే ఎండి పోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎడవెళ్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మహిళలు పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వానదేవుని ప్రసన్నం చేసుకునేందుకు కప్పతల్లి ఆట నిర్వహిస్తున్నారు. ఆచారం ప్రకారం రోకలి బండకు రెండు కప్పలు కట్టి, వేపాకులతో అలంకరించి గ్రామంలోని ఇంటింటికీ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటి యజమానులు కప్పలపై నీళ్లు పోసి వానదేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇలా చేస్తే సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని గ్రామ రైతుల ప్రగాఢ విశ్వాసమని మహిళలు తెలిపారు. గత ఏడాది కూడా ఇదే ఆచారం నిర్వహించగా అనంతరం మంచి వర్షాలు కురిశాయని, ఈసారి కూడా వానదేవుడు కరుణిస్తాడనే ఆశతో ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
పూర్వీకుల ఆచారాన్ని కొనసాగిస్తూ గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ వర్ణ దేవుడు పై పాటలు పాడుతూ బియ్యం, పసుపు, కుంకుమతో పాటు స్వచ్ఛందంగా నగదును సేకరిస్తున్నారు. సేకరించిన నగదుతో బెల్లం కొనుగోలు చేసి, బియ్యాన్ని పిండిగా తయారు చేసి బెల్లంతో పానకం సిద్ధం చేస్తారు. అదే రోజు సాయంత్రం గ్రామ శివారులోని చెరువు అలుగు (తూము) వద్ద నైవేద్యంగా సమర్పించి అనంతరం గ్రామస్థులు, చిన్నారులు ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రతతో పంటలు ఎండి పోతుండటంతో భగవంతుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించి రైతన్న కష్టాలను గట్టెక్కించాలని మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎడవెళ్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం మహిళలు యాదమ్మ, జంగమ్మ, అనసూయ, బాల కిష్టమ్మ, పోచమ్మ, సత్యమ్మ, చంద్రకళ, పద్మమ్మ, జయమ్మలతో పాటు సుమారు మరో 30 మంది మహిళలు పాల్గొన్నారు.






