పోలీస్​శాఖలో పైరవీలకు చెక్!

by Jakkula.Mamatha |

ఉమ్మడి జిల్లాలో పోలీస్ శాఖలో పైరవీలకు బ్రేకులు పడుతున్నాయి.

పోలీస్​శాఖలో పైరవీలకు చెక్!
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో పోలీస్ శాఖలో పైరవీలకు బ్రేకులు పడుతున్నాయి. ఇష్టమైన పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు నేతల సిఫారసులు చేయించుకుంటున్న అధికారులకు చుక్కలు కనబడుతున్నాయి. పైరవీలకన్నా పనితీరు, సమర్థతను బట్టి పోలీస్టేషన్లు కేటాయిస్తుండటంతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసులకు పోలీస్ కమిషనర్, జిల్లా ఎస్పీలు తలొగ్గకపోవడంతో ఇన్నేళ్లు పైరవీలతో పోస్టింగ్ లు తెచ్చుకున్న అధికారులు కంగుతింటున్నారు.

వారు ఎన్నిసార్లు నేతల ద్వారా చెప్పించుకుంటున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. పైరవీల ద్వారా వచ్చే కొంతమంది అధికారులకు నచ్చిన పోస్టేమో కానీ లూప్ లైన్ కేటాయించడంతో లబోదిబోమంటున్నారు. గతంలో వారిపై పెండింగ్ లో ఉన్న పలు కేసులకు సంబంధించి పరిశీలిస్తూ పోస్టింగ్​లు ఇస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు చేరుతున్నారు. కొంత మంది మళ్లీ పైరవీలకు పాల్పడుతుండటంతో వారికి లూప్ లైన్ పోస్టులు కానీ వీఆర్ కు కేటాయిస్తుండటంతో కంగుతింటున్నారు.

జోరుగా పైరవీలు..

ఉమ్మడి జిల్లాలో ఎస్సై, సీఐలకు పోస్టింగ్ లు కీలకంగా మారాయి. వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ తో పాటు భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈ పోస్టింగ్ ల కోసం ఎస్సైలు, సీఐలు జోరుగా పైరవీలు చేశారు. గడిచిన కొన్నేళ్లుగా తమకు నచ్చిన ప్రాంతాల్లో నేతల సిఫారసుల ద్వారా పోస్టింగ్ లు పొందారు. పైరవీలు చేస్తూ నేతలకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు అండగా ఉండడంతో పాటు వారి అనుచరులకు కావాల్సిన పనులు చేస్తున్నారు. ఏళ్లతరబడి కీలక స్థానాల్లో పోస్టింగ్ లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫారసు లేఖలను తీసుకొని నచ్చిన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలో కీలకమైన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

రాబడి వచ్చే స్టేషన్లతో పాటు రియల్ ఎస్టేట్ జరిగే పోలీస్ స్టేషన్లు ఎక్కువగా ఉన్నాయి. హసన్​పర్తి, కాజీపేట్, మామునూరు, జనగామ, స్టేషన్ ఘన్​పూర్, మిల్స్ కాలనీ, ధర్మసాగర్, హన్మకొండ, కుబేదారి, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలతో పాటు కీలకమైన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎక్కువగా పోలీసులు పనిచేసేందుకు పైరవీలు చేస్తున్నారు. కొంత మంది ఏళ్ల తరబడి ఒకే సబ్ డివిజన్ పరిధిలో పనిచేస్తుండగా మరికొంత మంది పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మినహా లూప్ లైన్ పోస్టులు చేయలేదు. వీరిలో కొంత మంది నగర శివారుతో పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసేందుకు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఉన్నతాధికారులకు అందజేయడంతో పాటు వారి ద్వారా పోలీస్ కమిషనర్ తో పాటు జిల్లా ఎస్పీలకు ఫోన్లు చేయిస్తున్నారు.

నేతల ద్వారా సిఫారసు చేయించుకున్న వారికి మాత్రం అనుకున్న పోలీస్ స్టేషన్ లో అవకాశం ఇవ్వడం లేదు. పైరవీల ద్వారా వచ్చే వారి పనితీరును బేరీజు వేస్తున్నారు. జిల్లాస్థాయిలో వారు పనిచేసిన పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నారు. వారికి గతంలో ఏమైనా ఆరోపణలు, షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, ఏసీబీ ట్రాప్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. గతంలోనూ సిఫారసు చేయించుకుని ఉంటే వారికి అవకాశం ఇవ్వడం లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కేటాయిస్తున్నారు. ఎస్సై, సీఐ స్థాయిలో ఒకటి లేదా రెండేళ్లు లూప్ లైన్ లో తప్పనిసరిగా పనిచేయాల్సి ఉండటంతో వాటికి కేటాయిస్తున్నారు. ఏసీబీ, సీసీఎస్, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తో పాటు ఇతర శాఖలకు కేటాయింపులు చేస్తున్నారు. గతంలో పైరవీల ద్వారా కేటాయింపులు చేయగా ప్రస్తుతం పైరవీలకు అవకాశం ఎక్కువగా ఇవ్వడం లేదు. ఎస్సై, సీఐల పనితీరు బేరీజు వేసే ఎక్కువ పోస్టింగ్ లను కేటాయిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కోవడం, పోలీసు స్టేషన్ పరిధిలో పంచాయితీలు, ఇతర సెటిల్ మెంట్లు చేసే వారికి ప్రాధాన్యత పోస్టులు కేటాయించడం లేదు.

రియల్ ఎస్టేట్, ఇసుకతో పాటు ఇతర దందాల్లో ఉన్న అధికారులకు కీలకమైన పోస్టింగ్ లను నేతలు చెప్పినా కేటాయించడం లేదు. కొంత మంది నేతలు ఉన్నతాధికారులు వినకపోవడంతో గుర్రుగా ఉండగా ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పైరవీ చేయించుకుంటే ఏమవుతుందోనని ఎస్సైలు, సీఐలు ఆందోళనలకు గురవుతున్నారు. పైరవీలు చేసుకున్న వారికి ఇతర పోలీస్ స్టేషన్లు కేటాయిస్తుండటంతో ఉన్న ప్రాంతంలోనే చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎస్సైలు, సీఐలతో పనితీరును కూడా అంచనా వేసి బదిలీ చేశారు. కొత్త డీజీపీ వచ్చిన తర్వాత పనితీరు ఆధారంగానే కేటాయింపులు చేస్తామని ప్రకటించడంతో అధికారులు ప్రయత్నాలను మానుకుంటున్నారు. కొంతమంది అధికారులు లూప్ లైన్ లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న డీసీపీలు కూడా పనిచేసే వారికే అవకాశం ఇవ్వాలని కోరడం, సెటిల్ మెంట్ అధికారులపై దృష్టి పెట్టడం కూడా పనిచేసే అధికారులకు పోస్టింగ్ లు వస్తున్నాయి.

ఈ మధ్యనే పోలీస్ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున ఎస్సైలు, సీఐల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో పైరవీలు చేస్తున్న సగం మంది అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వలేదు. సర్వీస్ రికార్డు చూసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కొంత మందిని సస్పెండ్ చేయగా మరికొంత మందిని వీఆర్ లో ఉంచారు. కొంత మందికి లూప్ లైన్ లో పోస్టింగ్ లు కేటాయించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో డీసీపీలు, ఎస్పీలు, సీపీ వరకు డైరెక్ట్ ఐపీఎస్ అధికారులు ఉండటం, యువ అధికారులే కావడంతో పైరవీలకు పెద్దగా స్పందించడం లేదు. ఎవరైనా అధికారులపై నేతలు ఒత్తిడి తెస్తే పట్టించుకోవడం లేదు. అవసరమైతే బదిలీ చేయించండని ఉల్టా చెప్పడంతో కంగుతింటున్నారు.

మొత్తంగా ఉమ్మడి జిల్లాలో పోలీసుల బదిలీలు పైరవీలకు తావులేకుండా జరుగుతుండటంతో ఇన్నాళ్లు లూప్ లైన్ లో ఉన్న అధికారులు సంతోషిస్తుండగా పైరవీలు చేస్తున్న అధికారులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వారి వివరాలన్నీ తవ్వుతూ రికార్డుల్లో ఉంచుతుండటంతో భవిష్యత్తులో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని భావిస్తున్నారు. పైరవీలకు అధికారులు వినకపోవడంతో కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో ఐపీఎస్ ల బదిలీలు జరిగితే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒకరిద్దరు అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు జిల్లా ఇన్​చార్జి మంత్రి తో పాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించనట్లు తెలుస్తోంది.

Next Story