- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైసలిస్తేనే ఫైల్ కదిలేది.. రెవెన్యూలో పెచ్చుమీరిన అవినీతి!
రోజురోజుకు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రోజురోజుకు భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిపోతున్న నగరీకరణ, పట్టణీకరణ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించుకుంది. దీంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు భూముల ధరలు పెరగడంతో గజం భూమి రూ.వందల్లో దొరికేది ఇప్పుడు రూ.వేలకు చేరింది. గుంటలు, ఎకరాల లెక్కన అమ్మే వ్యవసాయ భూములు సైతం ఇప్పుడు గజాల లెక్కన అమ్ముడు పోతున్నాయి. ఎకరం వ్యవసాయ భూమి రూ. 10 లక్షలకు దొరికేది ఇప్పుడు పదింతలు పెరిగి రూ. కోటి మార్కుకు చేరుకుంది. దీంతో గతంలో ఎన్నడూ లేనన్ని భూవివాదాలు, వ్యవసాయ భూముల్లో గెట్టు పంచాయతీలు కూడా పెరిగిపోయాయి. గుంట జాగా కోసం కూడా గుద్దుకుని చస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వివాదాస్పద భూముల పంచాయితీ పరిష్కారం కాకుండా అలాగే కొనసాగుతున్నాయి.
తాతలు, తండ్రుల కాలం నుంచి ఉన్న భూపంచాయితీలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా ఉన్నాయంటే సంబంధిత రెవెన్యూ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ లు ఎంత బాగా పనిచేస్తున్నాయో చెప్పకనే చెప్పొచ్చు. రెవెన్యూ శాఖలో నైతే అవినీతి సామ్రాజ్యం వేళ్లూనుకుంది. ముడుపులు చేతికందితే తప్ప ఫైలు ముట్టుకోని అధికారులు, సిబ్బందే ఆ శాఖలో అడుగడుగునా కనిపిస్తారు. వివాదాస్పద భూములతో అవస్థలు బాధితులకైతే వాటినే ఆదాయ మార్గాలుగా భావిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు, వారికేమాత్రం తీసిపోకుండా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు భూసమస్యలతో పరిష్కారానికి వారి గడపతొక్కుతున్న బాధితులను చెడుగుడు ఆడుకుంటున్నారు.
రెవెన్యూ సదస్సుల తర్వాత భూసమస్యలనేవే ఉండవన్నారు..
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో ఫిర్యాదు చేసుకున్న వారి సమస్యలను అప్పటి కప్పుడు పరిష్కరించదగినవైతే వెంటనే పరిష్కరించడం, లేదంటే నెలరోజుల్లో ఎంతటి జఠిలమైన సమస్యనైనా నెల రోజుల్లోపు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ, అది ఆచరణలో రుజువు చేసుకోలేకపోయింది. ఇంకా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మేజర్ సమస్యలు ప్రజల మధ్య కక్షలు, ద్వేషాలు పెంచుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పరిష్కారానికి నోచని భూ సమస్యల కారణంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మరెన్నో సంఘటనల్లో భూ వివాదాల కారణంగా హత్యలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇంతటి దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం వివాదాస్పద భూముల విషయంలో సత్వర పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ఫైల్ ముట్టుకున్నా రూ.10వేలివ్వాల్సిందే..
రెవెన్యూ శాఖలో ఎంతగా పెరిగిపోయిందంటే ముడుపులు అందకపోతే ఏ అధికారి, ఏ సిబ్బంది కూడా బాధితుల గోడు కూడా వినిపించుకోనంతగా పరిస్థితి తయారైంది. మా సమస్యను పరిష్కరిస్తే ఫార్మాలిటీ ప్రకారం ఇచ్చుకుంటామంటేనే కూర్చోబెట్టి సమస్యను వింటున్నారే తప్ప లేదంటే ఏవో సాకులు చెప్పి దులిపేసుకుంటున్నారు. సమస్య విన్నాక వారే పరిష్కార మార్గం చెబుతున్నారు. కానీ, షరతులు వర్తిస్తాయన్నట్లుగా ముందుగా కనీసం రూ. 10 వేలు వారి చేతిలో పడాల్సిందే. అలాగైతే ఫైలుకు పట్టిన దుమ్ము దులిపి ముందుకు పోనిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సర్వేయర్‌లకు సెఫరేటుగా రేటు..
వివాదాస్పద భూముల్లో హద్దుల నిర్ణయం కోసం అధికారికంగా కొలతలు చేయించడానికి టిప్పన్ చలాన్ కట్టినప్పటికీ సర్వేయర్లు ఎకరానికి రూ. 10 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ ముట్టజెపితే తప్ప కొలతల కోసం జిల్లా అధికారులు కూడా డేట్ ఇవ్వలేని పరిస్థితులున్నాయని బాధిత వర్గాలు చెపుతున్నాయి. కొలతల కోసం వచ్చిన డివిజన్ లెవల్, జిల్లా లెవెల్ అధికారులకు కూడా పని ముగించుకుని వెళ్లేటప్పుడు ఎక్కడో చోట దావత్ ఇచ్చి సీల్డ్ కవర్ చేతితో పెడితే సర్వే చేసిన సర్టిఫికెట్ కాపీ సంబంధిత భూ యజమానికి ఇవ్వని పరిస్థితి ఉందనే ఆరోపణలున్నాయి.
ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అసైన్మెంట్ భూముల్లో అనేక సమస్యలు..
జిల్లాలో ఒకే సర్వే నెంబర్‌లో వందలాది ఎకరాల విస్తీర్ణం ఉన్న అసైన్మెంట్ భూముల్లో ఎక్కువ శాతం భూసమస్యలున్నట్లు రెవెన్యూ ఉద్యోగులే చెపుతున్నారు. ఆయా భూముల్లో కొలతలు చేసి హద్దులు నిర్ణయించాలన్నా, వివాదాస్పద భూముల పంచాయతీ పరిష్కరించాలన్నా రెండు వర్గాలు సహకరించకపోవడంతో కూడా ఆ భూముల్లో పంచాయతీ అలాగే ఉండిపోతోందంటున్నారు. మరికొన్ని చోట్ల పదుల సంఖ్యలో విస్తీర్ణం మాత్రమే ఉన్న అసైన్మెంట్ భూముల సర్వే నెంబర్‌లోని వివాదాలను కూడా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌తో పాటు, రెవెన్యూ శాఖ కూడా పరిష్కరించడం లేదు.
ఫలితంగా మనుషుల మధ్య కక్షలు పెరుగుతున్నాయి. వివాదాస్పద భూముల పరిష్కారంపై సర్వేఅండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్‌తో పాటు, రెవెన్యూ శాఖలు కావాలనే తాత్సారం చేస్తున్నాయని, ఆయా భూముల్లో సమస్య పరిష్కారమైతే తమకు రావాల్సిన ముడుపులు రాకుండా పోతాయనే ఆలోచనతో సంబంధిత ఉద్యోగులు, అధికారులు ఆలోచిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూ పంచాయితీల వివరాల నివేదికను ప్రభుత్వమే తెప్పించుకుని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని భూ బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిని కోరుతున్నారు.






