కుప్పకూలిన ముడి చమురు ధరలు.. 98 డాలర్లకు చేరిన బ్యారెల్ ధర

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 6% పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్ల దిగువకు (98 డాలర్లు) చేరింది.

కుప్పకూలిన ముడి చమురు ధరలు.. 98 డాలర్లకు చేరిన బ్యారెల్ ధర
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థిలు శాంతి చర్చల నేపథ్యంలో సర్ధుమనుగుతున్నాయి. తాజాగా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో 14 క్లాజులతో కూడిన ఓ అవగాహన ఒప్పందం (MOU) దాదాపు సిద్ధమైందని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న శాంతి చర్చలు క్రమబద్ధంగా, ఆశాజనకంగా సాగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా పతనమయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, ఒక్కరోజులోనే ముడి చమురు ధరలు ఏకంగా 6 శాతం మేర పడిపోయాయి.

దీంతో గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర మళ్లీ 100 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 98 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. ఇటీవలి కాలంలో చమురు సంక్షోభానికి కారణమైన అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు (Peace Talks) సానుకూల దిశగా సాగుతుండటమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి, సరఫరా పునరుద్ధరణపై ఆశలు చిగురించడంతో అంతర్జాతీయంగా ముడిచమురు మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది. ఈ పరిణామం భారతదేశం లాంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద ఉపశమనం గా మారనుంది.

Next Story