- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోచారం నిల్వ సామర్థ్యం పెంపుపై కీలక అడుగు.. మంత్రి ఉత్తమ్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టు పూడికతీత పనులకు, అలాగే నియోజకవర్గంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెరువుల మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

దిశ, లింగంపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం ప్రాజెక్టు పూడికతీత పనులకు, అలాగే నియోజకవర్గంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెరువుల మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పోచారం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పూడికతీత పనులు చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 2.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన పోచారం ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 1.5 టీఎంసీలకు తగ్గిపోయిందని వివరించారు. దీంతో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ సెడిమెంట్ మేనేజ్‌మెంట్ (National Framework of Sediment Management)లో పోచారం ప్రాజెక్టును చేర్చి, కేంద్ర నిధులతో పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కడెం, లోయర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టులు ఈ ఫ్రేమ్‌వర్క్‌లో చోటు దక్కించుకున్న నేపథ్యంలో పోచారం ప్రాజెక్టును కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 17 చెరువులు, కుంటలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ.23.60 కోట్ల ఎఫ్‌డీఆర్ (FDR) అంచనాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఈ పనులకు త్వరితగతిన పరిపాలనా ఆమోదం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటి వనరులు బలోపేతం కావాలి. పోచారం ప్రాజెక్టులో పూడికతీతతో పాటు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు పూర్తయితే రైతులకు దీర్ఘకాలికంగా మేలు జరుగుతుంది. రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పని చేస్తాను అని తెలిపారు. ఎమ్మెల్యే వినతి పై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదనలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ENC) అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






