తిరుమలలో భక్తజన సంద్రం.. గ్రహణం వీడాక భారీగా పెరిగిన రద్దీ

by Malleboina Mahesh |

చంద్రగ్రహణం తర్వాత శ్రీవారి ఆలయం తెరుచుకోవడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

తిరుమలలో భక్తజన సంద్రం.. గ్రహణం వీడాక భారీగా పెరిగిన రద్దీ
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా తిరుమల ఆలయాన్ని మూసివేసిన అర్చకులు.. గ్రహణం అనంతరం తెరిచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇచ్చారు. చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం సుమారు 10 గంటల పాటు మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయం సంప్రోక్షణ అనంతరం తిరిగి తెరుచుకోవడంతో ఈ రోజు (బుధవారం) భక్తులు భారీగా పోటెత్తారు. నిన్న సాయంత్రం గ్రహణం ముగిసిన తర్వాత ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 8:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. విరామ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేయడంతో సాధారణ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి ఉన్నాయి.

దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం దాదాపు 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం గ్రహణం ప్రభావం తో దర్శన సమయం తగ్గడంతో కేవలం 27,300 మంది మాత్రమే స్వామివారిని దర్శించుకోగా, వారి ద్వారా హుండీకి రూ. 4.46 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే, నిన్న 9,985 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు క్యూ లైన్లలో తాగునీరు, అన్నప్రసాద వితరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Next Story