CRMPకి తప్పని అప్పుల తిప్పలు.. నిధుల సమీకరణ బాధ్యత జీహెచ్ఎంసీదే!

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 01:30:29  IST  )

హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ కోసం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) రెండో దశపై నీలినీడలు కమ్ముకున్నాయి.

CRMPకి తప్పని అప్పుల తిప్పలు.. నిధుల సమీకరణ బాధ్యత జీహెచ్ఎంసీదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్వహణ కోసం చేపట్టిన కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP) రెండో దశపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలకు ఇంకా మోక్షం కలగడం లేదు. రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు ఇవ్వదని, జీహెచ్‌ఎంసీనే సొంతంగా నిధులను సమీకరించుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. గతంలోనూ మొదటి దశ కోసం రూ. 1,400 కోట్ల రుణం తీసుకోగా, ఈసారి కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

1,142 కిలోమీటర్లు.. రూ. 3,825 కోట్లు..

నగర పరిధిలోని ప్రధాన రహదారుల నిర్వహణను 2018లో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. అప్పట్లో 811 కిలోమీటర్ల మేర రోడ్లను ఐదేళ్ల కాలానికి రూ. 1,839 కోట్లతో నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో బ్యాంకు లోన్ ద్వారా పనులు పూర్తి చేశారు. మొదటి దశ గడువు ముగిసి ఏడాదిన్నర కావస్తున్న నేపథ్యంలో, పాత రోడ్లతో పాటు మరికొన్ని కొత్త మార్గాలను కలిపి రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.మొత్తం 1,142 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణకు రూ. 3,825 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నిధులతో కేవలం రోడ్లే కాకుండా ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్లు, కెర్బ్ పెయింటింగ్, లేన్ మార్కింగ్ మరియు గ్రీనరీ పనులను కూడా నిర్వహించాల్సి ఉంటుంది.

మూడు కార్పొరేషన్లుగా విభజన ప్రక్రియ

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 27 యూఎల్బీలను విలీనం చేయడం, వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచడం వంటి మార్పులతో పాటు, జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఆర్ఎంపీ ప్రతిపాదనల ఆమోదంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. కొత్త కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాతే ఆయా విభాగాలు విడివిడిగా రుణాలు తీసుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

రూ. 4,717 కోట్లకు చేరిన అప్పుల భారం

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. గత పదేళ్లలో వివిధ ప్రాజెక్టుల కోసం రూ. 6,880 కోట్ల మేర అప్పులు చేశారు. ప్రతి నెలా అసలు, వడ్డీ కలిపి రూ. 150 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటివరకు రూ. 1,500 కోట్ల వరకు అప్పు తీర్చినప్పటికీ, ప్రస్తుత అప్పుల భారం రూ. 4,717 కోట్లకు చేరినట్లు అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్లలో జీహెచ్‌ఎంసీకి రూ. 1,025 కోట్లు కేటాయించినప్పటికీ, వాస్తవానికి విడుదల చేసింది రూ. 460 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

Next Story