మొహం నిండా రక్తంతో క్రికెటర్ బెన్ స్టోక్స్... షాక్ లో అభిమానులు

by Muthe.Rajitha |   (  Updated:2026-02-05 16:41:13  IST  )

ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

మొహం నిండా రక్తంతో క్రికెటర్ బెన్ స్టోక్స్... షాక్ లో అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం డర్హామ్‌లో జరిగిన నెట్స్ ట్రైనింగ్ సెషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. స్టోక్స్ ఆ సమయంలో నెట్స్ పక్కన నిలబడి ఉన్న సమయంలో క్రికెట్ బాల్ ముఖానికి గట్టిగా తగిలింది. అతని కుడి వైపు ముఖానికి పెద్ద గాయమయ్యి, తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటనతో మైదానంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

బాల్ బలంగా తగలడంతో స్టోక్స్ కుడి కన్ను చుట్టూ బాగా వాచిపోయి, నల్లగా మారింది. కుడి చెంపపై చిన్న కట్ అయినట్టు కూడా తెలుస్తోంది. ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే వైద్యులు అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ముక్కులో కాటన్ ప్యాడ్ పెట్టి రక్తస్రావాన్ని ఆపారు. ముఖం మొత్తం రక్తంతో నిండిపోయిన దృశ్యం చూసి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే బయటకు కనబడినంత ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలియజేసారు.

ఈ ఘటన తర్వాత బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అంత పెద్ద గాయంలోనూ ఏ మాత్రం హ్యూమర్ తగ్గకుండా.. ముఖం మీద గాయాలతో, రక్తంతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ "You should see the state of the cricket ball" అని సరదాగా క్యాప్షన్ పెట్టాడు. అంటే "బాల్ పరిస్థితి ఏలా ఉందో చూడాలి" అని జోక్ చేసాడు. అయితే మైదానంలో జరిగే గాయాలపై జోక్ చేయడం స్టోక్స్‌కు కొత్త కాదు.

స్టోక్స్ గాయాలు చూసి అభిమానులు ఒకవైపు భయపడినా.. మరోవైపు అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో "స్పీడీ రికవరీ స్టోక్స్", "త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలో చూడాలని ఉంది" అంటూ కోరుకుంటున్నారు. ఎన్నో గాయాల నుంచి కోలుకొని తిరిగి వచ్చిన స్టోక్స్ మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని, ఈ గాయం కూడా స్టోక్స్ ను ఆపలేదని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

కాగా ఇంగ్లాండ్ జట్టు తదుపరి టెస్ట్ సిరీస్ జూన్ 4 నుంచి న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. ఆ మ్యాచ్‌కు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండడంతో, స్టోక్స్ పూర్తిగా కోలుకుని ఆడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతకుముందు జరిగే కౌంటీ చాంపియన్‌షిప్ ప్రారంభ మ్యాచ్‌ల్లో డర్హామ్ తరపున అతను బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఆషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 4–1తో ఓడిపోవడంతో స్టోక్స్ కెప్టెన్సీపై విమర్శలు వినిపిస్తుండగా.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా అతని నాయకత్వంపై సమీక్ష చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అభిమానులు మాత్రం బెన్ స్టోక్స్‌కు అండగా నిలుస్తున్నారు.

Next Story