- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెట్ అంటే టీమ్ గేమ్.. ఒక్కరిది కాదు: భారత కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు!
టీమ్ ఇండియాలో ఇకపై ప్రతి ఒక్కరి కష్టానికి గుర్తింపు ఉంటుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. క్రికెట్‌లో చిన్న సహకారాన్ని కూడా విస్మరించకూడదని, గెలుపు గీత దాటించే ప్రతి రన్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచులో భారత్ విజయం సాధించి సెమీస్‌కి చేరింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో 97 పరుగులతో రాణించిన సంజూ శాంసన్ ను అంతా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అంటే టీమ్ గేమ్.. ఒక్కరిది కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి విజయంపై తనదైన శైలిలో స్పందించిన గంభీర్.. జట్టు స్ఫూర్తిని చాటి చెప్పారు. క్రికెట్ అనేది పదకొండు మంది కలిసి ఆడే ఆట అని, ఇందులో ప్రతి చిన్న సహకారం కూడా విలువైనదేనని ఆయన అన్నారు. గత కొన్నేళ్లుగా కేవలం భారీ స్కోర్లు, కొందరి వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాత్రమే చర్చ జరుగుతోందని, కానీ తన హయాంలో జట్టు విజయం కోసం కృషి చేసే ప్రతి ఒక్కరినీ సమానంగా గుర్తిస్తామని గంభీర్ దృఢంగా పేర్కొన్నారు.
చిన్న సహకారమే ముఖ్యం - సంజూ, దుబే ఉదాహరణ
వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ను ఉదాహరణగా చూపిస్తూ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 97 పరుగులు చేసి గెలిపించినప్పటికీ, చివరి ఓవర్లలో శివమ్ దుబే కొట్టిన రెండు బౌండరీలు అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ దుబే ఆ ఫోర్లు కొట్టకపోయి ఉంటే, శాంసన్ చేసిన 97 పరుగుల గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడేవారు కాదని ఆయన గుర్తు చేశారు. హెడ్ లైన్స్‌లో నిలిచే భారీ స్కోర్ల కంటే, జట్టును గెలుపు గీత దాటించే చిన్న చిన్న సహకారాలే తనకు అత్యంత ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశారు.
కొత్త సంస్కృతికి నాంది
గంభీర్ కోచ్‌గా ఉన్నంత కాలం జట్టులో ఏ ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు ఉండదని, ప్రతి క్రీడాకారుడి సహకారాన్ని గౌరవంగా ప్రస్తావిస్తామని ఆయన తన ఫిలాసఫీని చాటి చెప్పారు. జట్టు ప్రయోజనాల కోసం ఆడే ప్రతీ ప్లేయర్ కష్టానికి విలువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం కోసం చేసే పోరాటమే క్రికెట్ అసలైన అర్థమని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో గంభీర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. గంభీర్ కు మొదటి నుంచి సంజూపై నెగిటివ్ ఫీలింగ్ ఉందని, ఆ కారణంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడుతున్నారు.






