అక్రమ వెంచర్ల నిర్మాణాలపై కొరడా

by Ratna Kumari |

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు వికాస్‌నగర్ కాలనీలో అనుమతులు లేకుండా చేపట్టిన రెండు అక్రమ వెంచర్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు.

అక్రమ వెంచర్ల నిర్మాణాలపై కొరడా
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు వికాస్‌నగర్ కాలనీలో అనుమతులు లేకుండా చేపట్టిన రెండు అక్రమ వెంచర్ల నిర్మాణాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో సర్వే నంబర్లు 672, 675, 676, 677, 678లో అభివృద్ధి చేస్తున్న వెంచర్లలో ప్రభుత్వం, మున్సిపాలిటీ లేదా డీటీసీపీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, టౌన్ ప్లానింగ్ అధికారి వినీత్, మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరో రెండు వెంచర్లపై కూడా చర్యలు..

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పర్వతాలు మాట్లాడుతూ.. సంబంధిత వెంచర్లకు డీటీసీపీతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. నిర్మాణాలు నిలిపివేయాలని ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వెంచర్ నిర్వాహకులు స్పందించకపోవడంతో కూల్చివేత చర్యలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ప్రభుత్వం నుంచి తుది అనుమతులు పొందిన వెంచర్లలోనే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. పట్టణంలో అనుమతులు లేని మరో రెండు వెంచర్లకు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వాటిపైనా త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story