శ్రమ విభజన రాజకీయాలను కార్మిక లోకం తిప్పకొట్టాలి : బీవీ.రాఘవులు

by Muthe.Rajitha |

విభజన రాజకీయాలు చేస్తున్న శక్తులను తిప్పికొట్టాలని కార్మిక లోకానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు.

శ్రమ విభజన రాజకీయాలను కార్మిక లోకం తిప్పకొట్టాలి : బీవీ.రాఘవులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : శ్రమ అనేది కుల, మతాలకతీతమనీ, విభజన రాజకీయాలు చేస్తున్న శక్తులను కార్మిక లోకం తిప్పికొట్టాలని కార్మిక లోకానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు. మేడే దినోత్సవంగా సందర్భంగా హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ..సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యుద్ధం పోయి శాంతి నెలకొనాలన్నా, కార్మిక రాజ్యం రావాలన్నా సామ్రాజ్యవాదం నశించిపోవాలని నొక్కి చెప్పారు. ప్రపంచ శాంతి నెలకొనేలా ప్రతిఒక్కరూ ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. యుద్ధ ప్రభావం మన దేశ ప్రజలపైన తీవ్రంగా పడుతున్నదన్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఒకేసారి రూ.1000 పెరగడం వల్ల దాని ప్రభావం అన్నింటిపైనా పడుతుందని చెప్పారు. యుద్ధం ఆగకపోతే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇరాన్‌కు అండగా నిలబడేలా కేంద్ర ప్రభుత్వంపై ప్రజలందరూ ఒత్తిడి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లేబర్‌కోడ్‌లు కార్మికవర్గ పోరాటాలను ఆపలేవని స్పష్టం చేశారు. కార్మికులను అణచివేసేకొద్దీ పోరాటాలు తీవ్రమవుతాయనీ, యూనియన్లు లేకున్నా నోయిడా ప్రాంతంలో వేలాది కార్మికులు రోడ్లెక్కి పోరాటాలు చేయడం దానికి ప్రత్యక్ష ఉదహరణ అని చెప్పారు. చట్టాలున్నా, లేకున్నా అన్యాయం, అణచివేత జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా తిరగబడే తత్వం కార్మికవర్గానిదని తెలిపారు. ఈ మేడే దినోత్సవంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి, టి సాగర్, జి నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, జి రాములు, డీజీ నర్సింహారావు, వెంకట్రాములు, బాబూరావు, అరుణజ్యోతి, శ్రీరామ్ నాయక్, ఎమ్‌వీ.రమణ, ఆశయ్య, ఎం శ్రీనివాస్, శోభన్, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పి జంగారెడ్డి, ధర్మానాయక్, ప్రసాద్, కోట రమేశ్, ఎ వెంకటేశ్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Next Story