కార్పొరేట్ దోపిడీదారుల కోసమే మోడీ ప్రభుత్వం: చాడ వెంకటరెడ్డి

by Disha Web |
కార్పొరేట్ దోపిడీదారుల కోసమే మోడీ ప్రభుత్వం: చాడ వెంకటరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వృద్ధి అవకాశాలను మెరుగుపరచకుండా, ప్రజలకు జీవనోపాధి లేకుండా చేస్తూ.. తన కార్పొరేట్ దోపిడీదారుల కోసమే ప్రధాని మోడీ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రెండో రోజు మంగళవారం హైదరాబాద్ రేస్ కోర్స్ ఎంప్లాయిస్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో వందలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ, ధర్నా జరిగింది


ఈ ర్యాలీ నుద్దేశించి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. కార్పొరేట్లకు సేవ చేయడం, కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా చేసుకొని ప్రధాని కేంద్రంలో పాలన కొనసాగిస్తున్నాడని తెలిపారు.

మన పూర్వీకులు నిర్మించిన అపూర్వమైన దేశ సంపద నేడు మోడీ హయాంలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో బడా కార్పొరేట్, ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు అమ్ముడుపోతుందని అన్నారు. అందనంతా ఎత్తులో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలతో, రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగం‌తో ప్రజలు సతమతమౌతున్నారని ఇవేవి పట్టించుకోకుండా కేవలం కర్షకులకు, కార్మికులకు, సామాన్య ప్రజలకు హాని కలిగించే నల్ల చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని మండిపడ్డారు.


కొత్తగా నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చి దేశంలోని కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతరేక విధానాలను తిప్పి కొట్టాల్సిన అవసరముందని దీని కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 2 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి అధ్యక్షతన జరిగిన ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ.. 1991 సంవత్సరంలోనే ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ, విధానాలతో పంచ వృత్తులన్ని నిర్వీర్యమై ఆకలి చావులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వృత్తులన్నీ ఆధునీకరణ చేసి, సంక్షేమం కోసం కృషి చేయాలని, బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి ఆదుకోవాలన్నారు. ఈ జాతిలో పుట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సార్, మారోజు వీరన్నల, ఆశయాలను సాధించాలి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.


మీరు చేసే పోరాటాలకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్ర పంచ వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాయ బండి పాండురంగ చారి మాట్లాడుతూ.. విశ్వకర్మ పంచ వృత్తుల హక్కుల కోసం, సంక్షేమం, కోసం బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విశ్వకర్మ లకు 3 కోట్లు కేటాయించి విశ్వకర్మలను అవమాన పరిచినట్లు అవుతుందని, రాష్ట్రంలో 20 లక్షల మంది విశ్వకర్మలు ఉంటే ఈ బడ్జెట్ ఏ మాత్రం సరిపోదని, వెంటనే వీరికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఆత్మగౌరవం పేరిట విశ్వకర్మ భవనం నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం, ఎందుకు నిర్మించడం లేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వెంటనే ఆత్మగౌరవ భవనానికి పాలకవర్గం ఏర్పాటు చేయాలని కోరారు, 50 సంవత్సరాలు నిండిన పంచ వృత్తి దారులకు నెలకు సామాజిక పెన్షన్ కింద 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story

Most Viewed