భక్తి పేరుతో వికృత చేష్టలు.. మాదకద్రవ్యాల రీల్స్‌పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్

by Malleboina Mahesh |

రీల్స్ కోసం డ్రగ్స్ ప్రదర్శిస్తే కటకటాలపాలు అవుతారని, శివరాత్రి వేళ కొంత మంది యువకుల వికృత చేష్టలపై సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

భక్తి పేరుతో వికృత చేష్టలు.. మాదకద్రవ్యాల రీల్స్‌పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: కొంత మంది యువకులు భక్తి పేరుతో దేవుని ముందే మాదకద్రవ్యాలతో రీల్స్‌ చేయడంపై నగర సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. మహాశివరాత్రి పర్వదినం వేళ సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు యువకులు చేస్తున్న వికృత చేష్టలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్(twitter) వేదికగా ఆయన స్పందిస్తూ.. పరమ పవిత్రమైన శివరాత్రి పూజల్లో దైవ ప్రసాదం పేరుతో మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. భక్తికి, ముక్తికి సోపానమైన పండుగను ఇలాంటి ఉన్మాద చర్యలతో అపహాస్యం చేయడం సహించరానిదని ఆయన తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

కేవలం సాహసం చేశామని చెప్పుకోవడానికి, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై NDPS (Narcotic Drugs and Psychotropic Substances) చట్టం కింద కేసులు నమోదు చేస్తామని, ఒక్కసారి ఈ చట్టం ప్రయోగిస్తే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుందని యువతకు హితవు పలికారు. క్షణికానందం కోసం చేసే పనుల వల్ల బంగారు భవిష్యత్తును కటకటాల వెనుక బలిపెట్టుకోవద్దని ఆయన సూచించారు.

సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా మార్చుకోవాలి తప్ప, వ్యసనాలకు వాకిలిగా మార్చుకోవద్దని సీపీ కోరారు. విలువలని వదిలి, రోడ్డున పడి చేసే ఇలాంటి రీల్స్ వల్ల కలిగే నష్టాన్ని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. దేవుడిని, భక్తిని కించపరుస్తూ సమాజానికి ముప్పుగా పరిణమించే ఇలాంటి చర్యలను పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ గట్టిగా హెచ్చరించారు.

Next Story