వివాహితుడిని ప్రేమించిన యువతి.. జరిమానా విధించిన కోర్టు!

by Disha Web Desk 7 |
వివాహితుడిని ప్రేమించిన యువతి.. జరిమానా విధించిన కోర్టు!
X

దిశ, ఫీచర్స్ : భార్యాభర్తలు విడిపోతే చట్టపరంగా భరణం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 'ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్' ఆధారంగా జరిమానా విధించడం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా వినలేదు. కానీ ఇపుడు చైనాలో అలాంటి విచిత్రమే జరిగింది. తన ప్రేమికుడి భార్యకు 3.79 మిలియన్ యువాన్లు($560,000) చెల్లించాలని ఓ మహిళను ఆదేశిస్తూ చైనా కోర్టు ఇటీవలే ఓ వివాదాస్పద తీర్పును జారీ చేసింది. ఇంతకీ ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఏమిటి? సదరు మహిళకు ఫైన్ ఎందుకు వేశారు? చట్టపరంగా ఇది అర్హమైందేనా?

తమ చుట్టూ ఉన్న ప్రతీ విషయం నుంచి వేరు చేసిన అనుభూతిని 'పరాయీకరణ(ఏలినేషన్)' అంటారు. అది వ్యక్తి/సమాజం లేదా పరిసరాలు/పని ఏదైనా కావచ్చు. అలానే చట్టంలోనూ 'ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్(అనురాగం పరాయీకరణ కావడం)' అనే నిబంధన ఉంది. ప్రపంచవ్యాప్తంగా అధికార పరిధిలో రద్దు చేయబడిన ఈ నిబంధన.. ఒక జంట వివాహాన్ని దెబ్బతీసినందుకు, సాధారణంగా విడాకులకు దారితీసినందుకు కారణమైన మూడవ పక్షంపై జీవిత భాగస్వాముల్లో ఒకరు దావా వేయడాన్ని సూచిస్తుంది. ఈ మేరకు చైనాకు చెందిన లీ అనే అమ్మాయి.. వాంగ్ అనే వ్యక్తిని 1991లో పెళ్లి చేసుకుంది. 2008లో అతను జియోక్సియా అనే మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని ప్రారంభించాడు.

అయితే తన భర్త క్రమంతప్పకుండా ఆమెకు డబ్బు పంపుతున్నాడని, వాళ్లిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడనే నిజం లీకి తెలిసింది. ఈ విషయంపై వాంగ్‌ను నిలదీయగా జియోక్సియాతో తన సంబంధాన్ని అంగీకరించాడు. దీంతో తన భర్తను ప్రేమించిన వ్యక్తిపై దావా వేసిన 'లీ'.. తన భర్త 2013 నుంచి 2020 మధ్య 1.47 మిలియన్ యువాన్లను ($217,700) ప్రియురాలికి బదిలీ చేశాడని, రెండు అపార్ట్‌మెంట్లు సహా విలువైన కారును బహుమతిగా ఇచ్చాడని కోర్టులో విన్నివించింది. సంబంధిత సాక్ష్యాలను సమర్పిస్తూ తనకు ఇచ్చిన వస్తువులన్నింటినీ తిరిగి ఇప్పించాలని కోరింది. దీంతో 'లీ' పక్షాన నిలిచిన కోర్టు తన భర్తను ప్రేమించిన జియోక్సియాను 3.79 మిలియన్ యువాన్లు చెల్లించాలని ఆదేశించింది.

అయితే వాంగ్‌కు వివాహమైందని తనకు తెలియదని వాదించిన జియోక్సియా.. కొన్నేళ్లుగా అతని నుంచి తాను అందుకున్న డబ్బు పిల్లల సాయానికి వెళ్లిందని పేర్కొంది. అయితే ఈ కేసు ఉమ్మడి ఆస్తి గురించి మాత్రమేనని, ఇక్కడ పిల్లల మద్దతు గురించి ప్రస్తావన ఉండదని కోర్టు తెలిపింది.

చైనీస్ చట్టం ప్రకారం వివాహబంధంలోని ఇరు పక్షాల సమ్మతి లేకుండా ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా జంట ఉమ్మడి ఆస్తిని ఖర్చు చేయకూడదనే నిబంధన ఉంది. ఈ మేరకు వాంగ్ తన భార్యకు తెలియకుండా ప్రియురాలు జియోక్సియాకు బహుమతులు ఇచ్చినందున జియోక్సియా ఇప్పుడు వాంగ్ కుటుంబానికి మొత్తంగా 3.79 మిలియన్ యువాన్లను ($560,000) తిరిగి ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. అయితే పిల్లల మద్దతు కోసం వాంగ్‌పై ప్రత్యేక కేసు దాఖలు చేసేందుకు, దావా వేసేందుకు ఆమెకు అవకాశం ఉందని కోర్టు జియోక్సియాకు చెప్పింది.


Next Story

Most Viewed