- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధురాలిని హత్య చేసి నగలు దోచిన జంట.. ఆపై షాకింగ్ నిజం
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలనే దురాశతో ఒక వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చి, ఆమె వద్ద నగలు దొంగతనం చేసారు ఓ దంపతులు.

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలనే దురాశతో ఒక వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హతమార్చి, ఆమె వద్ద నగలు దొంగతనం చేసారు ఓ దంపతులు. అయితే అనంతరం అవి గిల్టు నగలు అని తేలడంతో షాక్ అయ్యి.. పారిపోతుండగా పోలీసులకు చిక్కారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. తిరుపతిలోని చెర్లోపల్లిలో నివసిస్తున్న లోకేశ్వరి అనే వృద్ధురాలు ఈ నెల 1వ తేదీ రాత్రి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె మరణించినట్లు గమనించిన కుటుంబ సభ్యులు, తొలుత అది సహజ మరణమేనని భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, స్నానం చేయించే సమయంలో ఆమె శరీరంపై కొన్ని గాయాలను గుర్తించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ జరపగా, ఆ ఇంట్లోనే పై అంతస్తులో అద్దెకు ఉంటున్న రెడ్డెప్ప, మహాలక్ష్మి దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది.
నిందితులు ఇద్దరూ గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని, ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ హత్య చేశారని పోలీసులు గుర్తించారు. లోకేశ్వరి ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఆమెను హతమార్చిన దంపతులు, ఆమె మెడలోని నగలతో పాటు బీరువాలో ఉన్న రూ. 50 వేల నగదును దోచుకెళ్లారు. అయితే, వారు దోచుకున్న నగలను విక్రయించేందుకు ప్రయత్నించగా, అవి అసలు బంగారం కాదని, గిల్టు నగలని తేలడంతో ఏం చేయాలో తోచక దొంగిలించిన నగదుతో విజయవాడకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి గిల్టు నగలు, మిగిలిన రూ. 14 వేల నగదును స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.






