జగిత్యాల అభివృద్ధికి రూ.6.13 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం

by Ratna Kumari |

జగిత్యాల అభివృద్ధికి రూ.6.13 కోట్ల పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెల్లడించారు.

జగిత్యాల అభివృద్ధికి రూ.6.13 కోట్ల పనులకు కౌన్సిల్ ఆమోదం
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాలను పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. చెరువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అమృత్ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పట్టణంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.6.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అలాగే రోడ్లపై గుంతల పూడ్చివేత, కాలువల శుభ్రపరిచే పనులు, ప్రజల వినియోగానికి పబ్లిక్ టాయిలెట్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన నిధుల మంజూరుకు కూడా కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వార్డు సభ్యులు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Next Story