అన్నదాతకు నకిలీ కాటు..ఆలేరులో పడిపోతున్న పత్తి దిగుబడి

by Malleboina Mahesh |

ఆలేరులో నకిలీ పత్తి విత్తనాల మాఫియా దందా! నాణ్యత లేని విత్తనాలు, నిషేధిత గడ్డి మందుల వాడకంతో ఎకరానికి 5 క్వింటాళ్ల వరకు పడిపోతున్న దిగుబడి

అన్నదాతకు నకిలీ కాటు..ఆలేరులో పడిపోతున్న పత్తి దిగుబడి
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం పరిధిలో నకిలీ పత్తి విత్తనాల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వం రైతులకు పత్తి విత్తనాలపై రాయితీ ఇవ్వకపోవడం, డిమాండ్‌కు సరిపడా విత్తనాలు సరఫరా చేయకపోవడం మూలంగా రైతులు పత్తి విత్తనాల కోసం ప్రైవేటు వ్యాపారులను, నకిలీ విత్తనాల వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. రైతులు పత్తి విత్తనాల కోసం ఆలేరు కేంద్రంగా కొనసాగుతున్న నకిలీ విత్తనాల మాఫియాను ఆశ్రయించడం మూలంగా, వారికి దళారులు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను నట్టేట ముంచుతూ అక్రమంగా రూ.లక్షల్లో గడిస్తున్నారు. తెల్ల బంగారం గా ప్రసిద్ధి గాంచిన పత్తి పంట సాగుపై ఈ ప్రాంత రైతులు ఎక్కువ మక్కువ చూపడంతో జిల్లాలో ప్రతి యేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ, నకిలీ విత్తనాల కారణంగా దిగుబడి మాత్రం పడిపోతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

కూలీల కొరత, నిషేధిత ‘గ్లైపోసెట్’ వాడకం

పత్తి పంట సాగు విషయంలో కలుపు నివారణ, కూలీల కొరత, పశువులతో గుంటుక వంటి పనులు రైతుల పట్ల శాపంగా మారాయి. పత్తి పంట సాగులో సమయానికి అనుగుణంగా కలుపు, గుంటుకలు తొలగకపోతే రైతులు నిండా మునిగే ప్రమాదం ఉంది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కూలీల కొరత నుంచి బయటపడడానికి నకిలీ పత్తి విత్తనాలు (లూజ్) నాటడం, కలుపు నివారణ కోసం, ఎలాంటి గుంటుకలు సైతం తోలకుండానే ప్రభుత్వం నిషేధించిన ‘గ్లైపోసెట్’ గడ్డి మందు స్ప్రే చేస్తూ పత్తి పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నకిలీ పత్తి విత్తనాల కారణంగా రైతులు సగటున ఒక్కొక్క ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి కోల్పోతున్నారు. ఫలితంగా రైతులు ఆరుగాలం శ్రమించినప్పటికీ నకిలీ విత్తనాల కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు.

పెరుగుతున్న పత్తి సాగు విస్తీర్ణం..

ఆలేరు ఏడీఏ పరిధిలోని ఆలేరు, గుండాల, మోత్కూర్, అడ్డగూడూరు, ఆత్మకూరు తదితర మండలాల్లో 2024-25 సంవత్సరంలో మొత్తం 45 వేల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. 2026-27 సంవత్సరంలో పత్తి సాగు మరింత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీనికోసం 1.35లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు. డిమాండ్ పెరగడం, ప్రభుత్వ సరఫరా లోపించడంతో నకిలీ మాఫియా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించి నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story