- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వదేశీ పర్యావరణహిత సాంకేతికత అభివృద్ధికి ఐఐసీటీ–వీఎస్‌ఎస్‌సీ ఎంఓయూ
స్వదేశీ, పర్యావరణహిత బ్లోయింగ్ ఏజెంట్ సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

దిశ, సికింద్రాబాద్: స్వదేశీ, పర్యావరణహిత బ్లోయింగ్ ఏజెంట్ సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ఈ నెల 8న తిరువనంతపురంలోని వీఎస్‌ఎస్‌సీలో ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా అధునాతన వ్యూహాత్మక అవసరాలకు అనువైన, పర్యావరణానికి హాని కలగకుండా ఉండే స్వదేశీ బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నారు. ఫ్లోరోకెమికల్ సంశ్లేషణ, ప్రాసెస్ డెవలప్‌మెంట్‌లో ఐఐసీటీకి ఉన్న నైపుణ్యాన్ని, వీఎస్‌ఎస్‌సీ సాంకేతిక అవసరాలు, మూల్యాంకన సామర్థ్యాలతో సమన్వయం చేస్తూ పరిశోధనలు చేపట్టనున్నారు.
దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గి...
ఈ సందర్భంగా ఐఐసీటీ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సంయుక్త పరిశోధన ద్వారా తదుపరి తరం పర్యావరణహిత ఫ్లోరోకెమికల్ సాంకేతికత అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. దీంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గి, 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనకు తోడ్పాటు లభిస్తుందన్నారు. వీఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ డా. రాజీవ్ యూ.పీ. మాట్లాడుతూ, అన్‌హైడ్రస్ హైడ్రోజన్ ఫ్లోరైడ్ నిర్వహణలో ఐఐసీటీకి ఉన్న ప్రత్యేక నైపుణ్యం ఈ ప్రాజెక్టు విజయానికి కీలకమవుతుందని పేర్కొన్నారు. ఐఐసీటీ శాస్త్రవేత్త డా. పున్నా నాగేందర్ మాట్లాడుతూ, హైడ్రోఫ్లోరోఒలిఫిన్స్ ఆధారిత బ్లోయింగ్ ఏజెంట్లు ఓజోన్ పొరకు హాని కలిగించకుండా, అత్యల్ప గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం పెరుగుతోందన్నారు. ఈ పరిశోధన విజయవంతమైతే అధునాతన ఫ్లోరోకెమికల్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడంతో పాటు వాణిజ్యీకరణకు కూడా మార్గం సుగమం అవుతుందని తెలిపారు.






