రైతులకు గుడ్ న్యూస్.. పత్తికోత యంత్ర ఆవిష్కరణ

by Muthe.Rajitha |

రైతుల కోసం పత్తికోసే యంత్రాన్ని ఆవిష్కరించింది ICAR.

రైతులకు గుడ్ న్యూస్.. పత్తికోత యంత్ర ఆవిష్కరణ
X

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు ఒక శుభవార్త. ఇప్పటివరకు వరికోత యంత్రం గురించి మాత్రమే తెలుసు. కానీ పత్తిచేలలో పత్తి తీయడం ఎంత కష్టమో ఆ పని చేస్తున్న వారికి మాత్రమే తెలుసు. పత్తి తీస్తున్నపుడు వాటి పత్తికాయల కొనలు గుచ్చుకొని రక్తం కూడా వస్తుంది. కానీ ఇపుడు రైతులకు, కూలీలకు ఆ కష్టం లేకుండా జాతీయ అగ్రికల్చర్ సంస్థ పత్తికోత యంత్రాన్ని ఆవిష్కరించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం భోపాల్‌లోని ICAR - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (CIAE)లో పత్తికోత యంత్రం ఆవిష్కరించి దానిని రైతులకు అంకితం చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రాన్ని అధికారికంగా ప్రారంభించి.. పత్తి కోత ప్రక్రియను చూశారు. రైతుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ యంత్రం రూపొందించబడిందని తెలిపారు.

వ్యవసాయంలో మెకనైజేషన్ అవసరమని, ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా వ్యవసాయం మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన అన్నారు. రైతుకు లాభసాటిగా ఉన్న ఈ యంత్రాన్ని తయారు చేసిన ICAR సంస్థను అభినందించారు. ఈ ఆవిష్కరణ భారతీయ రైతులకు, ముఖ్యంగా పత్తి సాగు చేసే వారికి, ఎంతో ఉపయోగకరమైన సాంకేతిక ముందడుగు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు పత్తిని చేతితో ఏరడం ఒక కష్టమైన, సమయం పట్టే పని. అలాగే అధిక కూలీల అవసరం ఉండే ప్రక్రియ కూడా. కూలీల కొరత, పెరుగుతున్న ఖర్చులు రైతులకు భారంగా మారుతున్నాయి. ఈ కొత్త యంత్రం ద్వారా పత్తి ఏరే ప్రక్రియ ఆటోమేటిక్ జరుగుతుంది.

దీని వల్ల కూలీలకు శ్రమ తగ్గుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాదు రైతులకు ఖర్చులు తగ్గి, పత్తి సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. ఈ యంత్రం సుమారు రూ. 15 లక్షల ధరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇది ట్రాక్టర్‌కు అనుసంధానించి ఉపయోగించుకునే విధంగా రూపొందించారు. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి పత్తి ప్రధాన రాష్ట్రాల రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటి ఆవిష్కరణలు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story