రెవెన్యూ కలెక్షన్.. కరెప్షన్‌పై కన్ను!

by Muthe.Rajitha |

రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొనసాగుతోన్న​అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.

రెవెన్యూ కలెక్షన్.. కరెప్షన్‌పై కన్ను!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కొనసాగుతోన్న​అవినీతిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఫిర్యాదులు వచ్చిన ఆఫీసుల్లో సోదాలు చేయడం, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనితో నిఘా వర్గాలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరుగుతోన్న కార్యకలాపాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. అలాగే శాఖలో అవినీతి తిమింగళాల జాబితాను తయారు చేసి, ఏసీబీకి అందించే పనిలో ఉన్నట్టు సమాచారం.

తీరు మార్చుకోని సబ్ రిజిస్టర్లు

ఈ మధ్య కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహించడం, లంచాలు తీసుకుంటోన్న అధికారులను ట్రాప్ చేసింది. అయినా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొనసాగుతోన్న దందాకు మాత్రం పుల్‌స్టాప్ పడటంలేదని విమర్శలు ఉన్నాయి. దీనితో అవినీతికి పాల్పడుతోన్న సబ్ రిజిస్టర్లను ట్రాప్ చేసి, కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీనితో నిఘా వర్గాలు కొన్ని రోజులుగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, అక్కడ జరుగుతోన్న దందాలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అందుకు ఆఫీసుకు సమీపంలోని డాక్యుమెంట్ రైటర్లే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు పట్టుకొమ్మలుగా ఉన్నారు. వారు చెప్పినంత ముట్టచెప్తేనే డాక్యుమెంట్స్ బయటికి వస్తాయనేది బహిరంగ రహస్యం. క్యూర్ ఏరియాలోని ఒక్కో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజుకు సగటున రూ.లక్షన్నర వరకు ముడుపుల రూపంలో వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్ని ఆఫీసుల్లో ఆ మొత్తం రూ. రెండు లక్షల వరకు ఉంటుందని ప్రచారం ఉంది. ఆ చోట ఈ చోట అనే తేడా లేకుండా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డబ్బులు ఇవ్వకుండా ఏ ఒక్కరూ బయటికి రాలేని పరిస్థితి తయారైంది.

సమయం చూసి సోదాలు

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. సమయం, సందర్భం చూసుకుని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, చుట్టుపక్కల ఉండే డాక్యుమెంట్ రైటర్ల ఆఫీసుల్లో సోదాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఆర్బన్ ఏరియాల్లో పనిచేస్తోన్న సబ్ రిజిస్టర్ల కదలికలపై నిఘా పెట్టినట్టు సమాచారం. ఒక్కో రోజు ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారు? అందులో ఆఫీసులోని స్టాఫ్‌కు ఎంత మొత్తంలో వాటాలు ఇస్తున్నారు? అనే కోణంలో కూడా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. కొందరు అధికారులు తమ సర్వీసులో అక్రమ సంపాదనతో పెద్ద ఎత్తున ఆస్తులు సమకూర్చుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అలాంటి అధికారుల ఇళ్లను సోదాలు చేసేందుకు ఏసీబీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

పోస్టింగ్‌కు రూ. కోట్లల్లో ఆఫర్లు

కొందరు సబ్ రిజిస్టర్లు, రిజిస్టర్లు తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తే రూ. కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని రూలింగ్ పార్టీ లీడర్లకు ఆఫర్లు పెట్టినట్టు తెలిసింది. దీనితో ఆశపడిన లీడర్లు సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి అసలు సంగతి వివరించినట్టు సమాచారం. అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో సదరు లీడర్లు మౌనంగా వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ మధ్య జరిగిన రిజిస్ట్రేషన్ శాఖ రివ్యూలో మంత్రి సంబంధిత శాఖ అధికారులపై సీరియస్ అయినట్టు తెలిసింది. ‘ఎవరెవరు పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసు. ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పారో తెలుసు. వారి చిట్టా మొత్తం ఏసీబీకి పంపాను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

Next Story