ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ వార్ రూమ్

by Malleboina Mahesh |

ఓటరు జాబితా ప్రక్షాళన (SIR) పై గాంధీభవన్‌లో కాంగ్రెస్ కంట్రోల్ రూమ్.. ఆన్‌లైన్ ఈ-సైన్ ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర సీఈఓకు విజ్ఞప్తి!

ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ వార్ రూమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళన(ఎస్ఐఆర్) ప్రక్రియను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇప్పటికే ఏఐసీసీ ఆయా రాష్ట్రాల్లో జరిగిన సర్ పైన పార్టీపరంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టింది. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసన గళం వినిపించారు. ప్రతి బూత్ లోనూ బీఎల్ఏ, బీఎల్ఏ 2 పాత్ర కీలకమైనందున వారికి అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాల్లో టీపీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ జూన్ 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 35,958 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీపరంగా 35,200 బీఎల్ఏలను నియమించామని పార్టీనేతలు వెల్లడించారు.

గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్

ఎస్ఐఆర్ ప్రక్రియను గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించేందుకు టీపీసీసీ కోఆర్డినేటర్లను నియమించింది. టీపీసీసీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా పులిపాటి రాజేష్ కుమార్, కోఆర్డినేటర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత గంపా వేణుగోపాల్ నియమితులయ్యారు. వారితో పాటు రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు కోఆర్డినేటర్లను టీపీసీసీ నియమించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట ఇన్ చార్జీలతో పాటు పార్టీ సీనియర్ నేతను నియమించుకుని ఎస్ఐఆర్ ను సమన్వయం చేస్తున్నారని పార్టీ నేతలు తెలిపారు. ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్షులను జిల్లా కోఆర్డినేటర్లుగా నియమించారు. వీరు న్యాయవాదిని నియమించుకుని స్థానికంగా సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

గాంధీభవన్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో తమ దృష్టికి వచ్చిన అనేక సమస్యలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి కాంగ్రెస్ ఈసీ కోఆర్డినేషన్ నేతలు తీసుకెళ్తున్నారు. ఎన్యుమరేషన్ సమయాన్ని 30 రోజులు కాకుండా 60 రోజులకు పెంచాలని, బీఎల్ఏల జాబితా తక్షణమే ఈ జాబితాను బీఎల్ఓలకు ఇవ్వాలని కోరారు. ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ ప్రాసెస్‌లో ఈ-సైన్ తప్పనిసరి అని, దానికోసం ఆధార్ అనుసంధానం పెద్ద అడ్డంకిని సృష్టిస్తోందన్నారు. ఆధార్ తో కాకుండా పాస్ పోర్ట్, ఇతర స్వీయ ధ్రువీకరణ పత్రాలు జత చేసే వెసులుబాటు ఇవ్వాలని సీఈవోను కలిసి నేతలు విజ్ఞప్తి చేశారు.

Next Story