- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండాల, కాచినపల్లి అటవీశాఖలో అవినీతి జలగలు
గుండాల, కాచినపల్లి అటవీశాఖ రేంజ్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల ఏసీబీ దాడిలో దాడుల్లో బానోతు నరేశ్ అనే బిట్ ఆఫీసర్ పట్టుబడటం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అడవి నుంచి దహన సంస్కారాలకు కట్టెలు కావాల్సి వచ్చినా.. పెళ్లి సమయంలో ఇంటి ముందు వేసే పందిరికి కావాల్సిన కలప తెచ్చుకోవాలన్నా.. ఇందిరమ్మ ఇండ్లకు గుట్టల నుంచి రాళ్లు తీసుకెళ్లాలన్నా చేయి తడపాల్సిందేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టాలు ఉన్న అటవీ భూముల్లో బోరేస్తే రూ.7వేలు, కరెంటు లైన్‌కు రూ.15వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. - దిశ, గుండాల
దిశ, గుండాల: గుండాల కాచినపల్లి అటవీ రేంజ్ కార్యాలయాల్లో అవినీతికి అద్దు అదుపు లేకుండా పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గుండాల, కాచనపల్లి రేంజ్ అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో కిందిస్థాయి సిబ్బందికి ఆడింది ఆట పాడింది పాటగా మారిందని తెలుస్తున్నది. గిరిజన రైతులకు సాధారణంగా పోడు వ్యవసాయం ఆధారం. పోడు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుని ట్రెంచులు కొడతామని ఏటా బెదిరింపులకు పాల్పడుతూ కిందిస్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా గుండాల మండలంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బానోతు నరేశ్ అనే బిట్ ఆఫీసర్ పట్టుబడటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
వసూళ్ల పర్వం..
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను తుంగలో తొక్కి వారి ఆచారాలను సంప్రదాయాలను పక్కకు పెట్టి కొందరు అటవీశాఖ అధికారులు అరాచకం సృష్టిస్తున్నారు. చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు కట్టెల కోసం వెళ్లిన వారితో అనుమతి అవసరం అని, లేదంటే చర్యలు తీసుకుంటామని బేరాలు చేస్తూ చివరికి 1000నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్ మేలో వందల సంఖ్యలో గ్రామాల్లో వివాహాలు జరుగుతుంటాయి. వివాహం సమయంలో ఇంటి ముందు వేసే పందిరికి కావాల్సిన కలప తెచ్చుకోవాలంటే రూ.5వేల నుంచి రూ.10వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు గుట్టల నుంచి రాళ్లు తెచ్చుకునేందుకు డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే ట్రాక్టర్లను సీజ్ చేయడమో లేదా రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ బేరాలు చేసుకుని వదిలిపెడతారు.
స్థానికంగా ఉండని అధికారులు
గుండాల కాచినపల్లి రేంజ్ అధికారులు స్థానికంగా ఉండకపోవడం కిందిస్థాయి సిబ్బందికి అవకాశం దొరికినట్లుగా భావించి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారు. అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నా, పాత పట్టాలు ఉన్నా బోరేస్తే రూ.7వేలు, కరెంటు లైన్‌కు రూ.15వేలు వసూలు చేస్తున్నారు. కిందిస్థాయి సిబ్బంది తీసుకుంటున్న మొత్తంలో కొందరు డివిజనల్ స్థాయి అధికారులకు వాటాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అటవీశాఖ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులు.. తనిఖీలు..
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఇటీవల చైతన్య వంతులై లంచగొండి అధికారుల సమాచారం అందించడం, పట్టించడం జరుగుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పోడు భూమిలో ట్రెంచ్ కొట్టించి ఇబ్బందులు పెడతామని బెదిరించిన బీట్ ఆఫీసర్‌ను ఏసీబీ డీఎస్పీ రమేశ్‌కు పట్టించారు. స్థానిక విద్యుత్ అధికారుల తీరుపై ఇటీవల ఇల్లెందులో పర్యటించిన ట్రాన్స్‌కో సీఎండీ మండల ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎండీ విద్యుత్ అధికారులకు అక్షింతలు వేశారు.






