సామాన్యుడి జేబులకు చిల్లు.. రోడ్డెక్కాలంటేనే వణికిపోయే పరిస్థితి!

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-02 04:51:36  IST  )

జాతీయ రహదారులపై ప్రయాణం సామాన్యుడికి భారంగా మారుతున్నది. ఒకప్పుడు ప్రయాణ సౌలభ్యం కోసం వేసిన రోడ్లు ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద జేబులకు చిల్లు పెడుతున్నాయి.

సామాన్యుడి జేబులకు చిల్లు.. రోడ్డెక్కాలంటేనే వణికిపోయే పరిస్థితి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారులపై ప్రయాణం సామాన్యుడికి భారంగా మారుతున్నది. ఒకప్పుడు ప్రయాణ సౌలభ్యం కోసం వేసిన రోడ్లు ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద జేబులకు చిల్లు పెడుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా టోల్ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగి ఏకంగా రూ.61వేల కోట్లు దాటడం గమనార్హం. హోల్‌సేల్ ధరల సూచిక(డబ్ల్యూపీఐ) సాకుతో ఏటా చార్జీలు పెంచుతున్న కేంద్రం.. రహదారి నిర్మాణ వ్యయం పూర్తిగా వసూలైనప్పటికీ టోల్ బాదుడును మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో టోల్ వసూళ్ల గణాంకాలు, పెరుగుతున్న ధరల వెనక ఉన్న నిబంధనలు, వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన కొత్త వెసులుబాట్లపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పూర్తి వివరాలు వెల్లడించింది.

రెట్టింపు కంటే ఎక్కువే వసూలు..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల జేబులకు చిల్లుపడుతున్నది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా టోల్ వసూళ్లు భారీగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.27,926.67 కోట్లుగా ఉన్న టోల్ ఆదాయం, 2024-25 నాటికి ఏకంగా రూ.61,408.15 కోట్లకు చేరింది. అంటే ఐదేళ్ల కాలంలో టోల్ వసూళ్లు రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. టోల్ వసూళ్లు, నిబంధనలు మరియు వాహనదారులకు కల్పిస్తున్న వెసులుబాటుపై కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వివరాలను వెల్లడించారు.

ధరల పెంపునకు కారణాలివే..

టోల్ ధరలు ఏటా పెరగడానికి ప్రధాన కారణం హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్(డబ్ల్యూపీఐ). నేషనల్ హైవే ఫీ రూల్స్-2008 ప్రకారం ప్రతి ఏటా ద్రవ్యోల్బణాన్ని బట్టి టోల్ రేట్లను సవరిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే సామాన్యులపై భారం తగ్గించేందుకు పలు సవరణలను సైతం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.

కొత్త నిబంధనలు..

వాణిజ్య ఇతర వాహనాలు (కార్లు, జీపులు) ఏడాదికి రూ.3వేలు చెల్లిస్తే 200 సార్లు టోల్ ప్లాజాల గుండా ఉచితంగా వెళ్లే సదుపాయం ఉంటుంది. ఫాస్టాగ్ లేని వాహనాలకు గతంలో రెట్టింపు రుసుము వసూలు చేసేవారు. ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లిస్తే దానిని 1.25 రెట్లు మాత్రమే వసూలు చేసేలా నిబంధన మార్చారు. ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో(ఎంఎల్ఎఫ్ఎఫ్) విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. తద్వారా వాహనాలు ఆగకుండానే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్పీఆర్) ద్వారా టోల్ కట్ అవుతుంది.

ఆగని టోల్ వసూలు..

ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తిరిగి వచ్చినప్పటికీ టోల్ వసూళ్లు ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రహదారుల నిర్వహణ, విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం ఈ నిధులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ)లో జమ చేస్తున్నట్టు తెలిపింది. నేషనల్ హైవే ఫీ రూల్స్ ప్రకారం కన్సెషన్ పీరియడ్ ముగిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం టోల్ వసూలు చేసే అధికారం కలిగి ఉంటుందని వివరించింది.

గుండాల, కాచినపల్లి అటవీశాఖలో అవినీతి జలగలు

Next Story