- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ శాఖ అధికారుల పై అవినీతి ఆరోపణలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ శాఖ అధికారుల పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల వ్యవసాయ శాఖ అధికారుల పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దహెగాం ఫర్టిలైజర్ యూనియన్ గ్రూప్‌లో రూ.20 వేల చొప్పున ఫోన్‌పే ద్వారా జరిగిన లావాదేవీల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ చాటింగ్ వివరాల ప్రకారం, మండలంలోని ఫర్టిలైజర్ యూనియన్ తరఫున ప్రతి షాపు రూ.10 వేల చొప్పున జమ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మండలంలో మొత్తం 42 నుంచి 45 వరకు ఫర్టిలైజర్ షాపులు ఉండగా, ప్రస్తుతం 36 షాపులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, యాక్టివ్‌లో ఉన్న వారంతా తప్పనిసరిగా తమవంతు బాధ్యతగా యూనియన్‌కు డబ్బులు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత విషయం కాదు. కాబట్టి బ్రతిమాలి, బుజ్జగించే అవసరం లేదు.
డబ్బులు ఇవ్వని వారి జాబితా తయారు చేసి వచ్చే ప్రతి శాఖకు అందజేస్తాం అంటూ యూనియన్‌కు చెందిన ఓ వ్యక్తి దహెగాం ఫర్టిలైజర్ యూనియన్ వాట్సాప్ గ్రూప్‌లో హెచ్చరిక చేసినట్లు చాటింగ్‌లో కనిపిస్తోంది. మరో సభ్యుడు నేను ఆల్రెడీ ఏవో సార్‌కు ఇచ్చాను అంటూ గ్రూప్‌లో మెసేజ్ పెట్టినట్లు సమాచారం. మరికొందరు రూ.20 వేల చొప్పున ఫోన్‌పే ద్వారా చేసిన లావాదేవీల స్క్రీన్‌షాట్‌లను కూడా గ్రూప్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్‌పే లావాదేవీలు, వాట్సాప్ చాటింగ్ వివరాలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారుల పనితీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్టిలైజర్ షాపుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కొందరు అధికారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఫోన్‌లో సంప్రదించి వివరణ కోరగా, యూనియన్ సభ్యులు తమలో తాము డబ్బులు జమ చేసుకుంటే వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా యూనియన్ వ్యక్తిగత వ్యవహారం. దీనికి వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి సంబంధం లేదు అని ఆయన తెలిపారు.






