- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రాష్ట్రాల కాంగ్రెస్ వైఖరితో రైతులు నష్టపోతున్నారు
కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని గూడూరు గ్రామం వద్ద భీమా నదిపై నిర్మించిన రివర్ బ్రిడ్జి ను, కృష్ణ నదిపై గూగల్ ప్రాంతంలోని బ్రిడ్జి ని బీఆర్ఎస్ మాజీమంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి లు సందర్శించిన సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కర్ణాటక వైపు ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే, తెలంగాణ వైపు ఉన్న ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్ నగర్ ను ఎడారిగా మార్చేందుకు పక్క రాష్ట్రాలు ప్రయత్నం చేస్తున్నాయని, తుంగభద్ర నీరు రాకుండా ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ శ్రీశైలం కు నీరు రాకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు 10 శాతం పనులు పూర్తి చేస్తే రిజర్వాయర్లు నింపుకునేందుకు అవకాశం ఉండేదని, లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన అన్నారు. గుండ్రేవుల నుంచి నీరు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ కుట్ర చేస్తుందని, కర్ణాటక కూడా అక్రమ ప్రాజెక్టులు, బ్యారేజీలు, చెక్ డ్యామ్ లు కడుతూ పై నుంచి నీరు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం 300 టీఎంసీ నీటి సామర్థ్యం పెంచేందుకు పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే భూ సేకరణ ప్రారంభించారని, భీమా నది కే నేరుగా హైడ్రాలిక్ గేట్లు పెట్టారని, వర్షాకాలం కూడా నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక లో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో జరిగిన విషయాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రమాదంలో ఉందని, నీళ్లను కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు.






