Nirmala Sitaraman: 'సామాన్యులను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు'

by S Gopi |

నిబంధనలు ఉల్లంఘించాలని తాను చెప్పడం లేదని, అయితే అర్హులైన వారికి సేవలు అందించడంలో అధికారులు మరింత సానుకూలంగా వ్యవహరించాలని కోరారు.

Nirmala Sitaraman: సామాన్యులను ఆఫీసుల చుట్టూ తిప్పొద్దు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కీలక సందేశం ఇచ్చారు. సామాన్యులు తమ హక్కుగా రావాల్సిన సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అనవసరంగా తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, నిబంధనల పరిధిలోనే వారి పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం ముంబైలో కొత్త 'ఆయ్కర్ సింధు' భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆమె, ఈ భవన నిర్మాణానికి అనుమతులు పొందడంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులే అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని గుర్తు చేశారు. 'మీ వెనుక శక్తివంతమైన శాఖ ఉన్నప్పటికీ మీకే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రజలను అనవసరంగా తిప్పకుండా వారి పనులు పూర్తి చేయండి' అని ఆమె సూచించారు. నిబంధనలు ఉల్లంఘించాలని తాను చెప్పడం లేదని, అయితే అర్హులైన వారికి సేవలు అందించడంలో అధికారులు మరింత సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఇదే క్రమంలో, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలోనూ నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 1973 నుంచే ఆదాయపు పన్ను శాఖ ఆధీనంలో ఉన్న భూమిలో అక్రమ ఆక్రమణలు జరగడం పాలనా వైఫల్యానికి సంకేతమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం అధికారుల బాధ్యత అని, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు.

Next Story