పెట్రోల్ కొరత.. క్యూలో శవం!

by Muthe.Rajitha |

ఉత్తరాఖండ్‌లో పెట్రోల్ కోసం ఏకంగా శవం గంటలకొద్దీ క్యూలో వేచి చూడాల్సి వచ్చింది.

పెట్రోల్ కొరత.. క్యూలో శవం!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ యుద్ధం వల్ల గల్ఫ్ నుంచి ఆయిల్ సరఫరా దెబ్బతినడం, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమస్యలు ఇవన్నీ కలిసి భారత్ లో తీవ్ర ఇంధన కొరతకు దారి తీశాయి. అయితే దేశంలో పెట్రల్ కొరత ఎంత తీవ్రంగా తెలియజెప్పే ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. పెట్రోల్ కోసం ఏకంగా శవం గంటలకొద్దీ క్యూలో వేచి చూడాల్సి వచ్చింది. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ నిజంగా జరిగిన ఘటన ఇది. ఉత్తరాఖండ్‌లోని నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిధావే గ్రామంలో సర్వేశ్ కసౌధన్ అనే వ్యక్తి మృతదేహాన్ని అంతిమ సంస్కారాల నిమిత్తం శ్మశానానికి తరలిస్తుండగా, మధ్యలోనే వాహనంలో పెట్రోల్ అయిపోయింది. దీంతో చేసేదేమీ లేక డ్రైవర్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వాహనాన్ని తీసుకెళ్లగా, అక్కడ అప్పటికే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఉన్నాయి.

స్థానికులు, బంధువులు పరిస్థితిని వివరించినప్పటికీ, నిబంధనల ప్రకారం క్యూలో రావాలని చెప్పడంతో మృతదేహం ఉన్న వాహనం దాదాపు రెండు గంటల పాటు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, అంతసేపు వేచి చూసిన తర్వాత తీరా వాహనం బంకు వద్దకు చేరుకోగానే.. స్టాక్ అయిపోయిందంటూ నిర్వాహకులు బంకును మూసివేశారు. ఈ ఘటనను అక్కడి వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. కనీసం అత్యవసర సేవలు, అంతిమ యాత్ర వాహనాలకైనా ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో వ్యవస్థలు ఉండటంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Next Story