- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ అధికారుల అలసత్వం.. కబ్జాదారులకు వరం
సర్కారు భూములకు రక్షణ కరువైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను భూ అక్రమణదారులు కాజేస్తున్నారు.

దిశ, మేడ్చల్ బ్యూరో : సర్కారు భూములకు రక్షణ కరువైంది. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను భూ అక్రమణదారులు కాజేస్తున్నారు. వాటిని రక్షించాల్సిన అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ పై ఒకవైపు విస్తృత ప్రచారం జరుగుతుండగా, మరోవైపు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంగా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ భూములపైనే పెట్టుబడులు..?
కొంతమంది భూ బకాసురులు ప్రభుత్వ భూములపైనే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, రాజకీయ నాయకులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని స్థానికులు అంటున్నారు. భూ కబ్జాదారులు ఇచ్చే అక్రమ ప్రయోజనాలకు ఆశపడుతున్న కొందరు రెవెన్యూ అధికారులు కోర్టుల్లో ప్రభుత్వ తరఫున సమర్థంగా వాదనలు వినిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండల పరిధిలోని సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు ఉన్నాయి. హై కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువడి ఐదు నెలలు గడిచినా కౌంటర్లు దాఖలు చేయకుండా, అప్పీల్ పిటిషన్లు వేయకుండా కాలయాపన చేయడం వెనుక ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం బాచుపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆకుల సతీష్ ఆధ్వర్యంలో స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ఘటనతో మరోసారి కబ్జాదారులు, రెవెన్యూ అధికారుల మధ్య లోపాయికారీ ఒప్పందాల పై చర్చ జరుగుతోంది.
కోర్టు తీర్పులు వచ్చినా కదలని యంత్రాంగం..
నిజాంపేట్ గ్రామంలోని సర్వే నెం. 325లో ఉన్న సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమి (Lr. No. B/361/2019) విలువ దాదాపు రూ.600 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో నమోదైన W.P. Nos. 10920, 11110 & 11897 of 2020 కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పటికీ అధికారులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, అదే గ్రామంలోని సర్వే నెం. 233/23 నుంచి 233/26 వరకు ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి (No. A/1741/2008) విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. W.P.M.P. No. 3586 of 2014 మరియు W.A. S.R. No. 191822 of 2014 కేసుల్లో ప్రభుత్వ తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించకపోవడం వల్లే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పాత్ర పై సమగ్ర విచారణ జరగాలి..
ప్రభుత్వ భూములుగా స్పష్టమైన రికార్డులు ఉండి, జిల్లా కలెక్టర్ స్వయంగా నిషేధిత (Prohibited) జాబితాలో చేర్చిన ఈ ఆస్తులకు సంబంధించి హైకోర్టులో సకాలంలో కౌంటర్ దాఖలు చేయకపోవడం వెనుక అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1,400 రోజుల పాటు కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని, ఆ తర్వాత కూడా గత ఐదు నెలలుగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం అప్పీల్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేయలేదన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ఈ భూముల పరిరక్షణ పై దృష్టి సారించి, బాధ్యులైన అధికారుల పై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆకృతి ఆక్రమణ పై చర్యలేవి..?
బాచుపల్లి గ్రామంలోని సర్వే నెం. 454లోని ప్రభుత్వ భూమితో పాటు చెరువు కట్ట బఫర్ జోన్‌ను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి చెందిన ఆకృతి కన్స్ట్రక్షన్స్ ఆక్రమించిందని, అక్కడ అక్రమంగా రహదారి ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారని ఆకుల సతీష్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి అలసత్వాన్ని సహించరాదని, ఆక్రమణదారుల పై వెంటనే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుని, ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని ఆయన కోరారు. గతంలో జేఏసీగా ఏర్పడి ప్రభుత్వ భూములను కాపాడిన ప్రస్తుత అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు నేడు కబ్జాలు జరుగుతున్నా మౌనంగా ఉండటం సరికాదని, వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.






