సలసల కాగుతున్న వంటనూనెల ధరలు

by Batti.Sumithra |

పండగల సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో వంటింట్లో మరోసారి సెగ మొదలైంది.

సలసల కాగుతున్న వంటనూనెల ధరలు
X

దిశ, కామారెడ్డి : పండగల సీజన్ దగ్గరపడుతున్న తరుణంలో వంటింట్లో మరోసారి సెగ మొదలైంది. గత ఏడాది కాలంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగి గృహిణుల బడ్జెట్‌ను కుదిపేస్తున్నాయి. ప్రధాన వంటనూనెల ధరలు సగటున 128 శాతం వరకు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుత ధరలు ఇలా..

జూలై 3వ తేదీ నాటికి రిటైల్ మార్కెట్‌లో ప్రధాన వంటనూనెల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పామాయిల్ : లీటర్ రూ.147.97

పల్లి నూనె : లీటర్ రూ.165

సన్‌ఫ్లవర్ ఆయిల్ : లీటర్ రూ.180

గత ఏడాదితో పోలిస్తే అన్ని రకాల వంటనూనెల ధరలు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగాయి. రిటైల్ వ్యాపారులు సైతం పండగల సీజన్‌లో డిమాండ్ పెరుగుతుందనే అంచనాతో నిల్వలను తగ్గించి, ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

యుద్ధం.. డాలర్ ప్రభావం..

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణా, బీమా ఖర్చులు భారీగా పెరిగాయి. ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.97 వరకు పడిపోవడం కూడా దిగుమతుల పై ప్రభావం చూపింది. ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు తమ పామాయిల్ ఉత్పత్తిలో కొంత భాగాన్ని బయోఫ్యూయల్‌కు మళ్లిస్తున్నాయి. ఇండోనేషియా ఈ నెల 1వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్‌లో అధిక శాతం పామాయిల్ మిశ్రమాన్ని వినియోగించే విధానాన్ని అమలు చేయడం కూడా ధరలపై ఒత్తిడిని పెంచింది. ఈ పరిణామాలతో ముంబై రేవుకు దిగుమతయ్యే పామాయిల్ ధర 11 శాతం, సోయా ఆయిల్ 6 శాతం, సన్‌ఫ్లవర్ ఆయిల్ 20 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఎల్‌నినో భయం.. సాగు తగ్గుదల

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. దీంతో దేశంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేరుశనగ, సోయాబీన్ ఎక్కువగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ నూనెగింజల సాగు ఇప్పటికే 30 శాతం తగ్గినట్లు సమాచారం. వర్షాలు సకాలంలో లేకపోతే రాబోయే పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిగుమతుల పై ఆధారపడటమే ప్రధాన కారణం..

దేశ అవసరాల్లో దాదాపు 60 శాతం వంటనూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, రవాణా వ్యయాలు అధికమవడం నేరుగా దేశీయ మార్కెట్‌ పై ప్రభావం చూపుతోంది. స్థానికంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

గృహిణుల బడ్జెట్‌కు గండం..

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు వంటనూనెల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. నెలకు 3 నుంచి 4 లీటర్ల నూనె వినియోగించే కుటుంబాల పై రూ.600 నుంచి రూ.700 వరకు అదనపు భారం పడుతోంది. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా ధరలు పెంచేందుకు సిద్ధమవుతుండటంతో సామాన్యులపై ప్రభావం మరింత పెరిగే అవకాశముంది.

పండగల నాటికి మరింత పెరిగే అవకాశం..

సాగు తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల, దిగుమతి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో పండగల సీజన్ నాటికి వంటనూనెల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా, వచ్చే నెలల్లో మరింత భారం పడే అవకాశం ఉండటంతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story