యూజీసీ కొత్త రూల్స్ మీద జరుగుతున్న వివాదం ఏంటీ?

by Muthe.Rajitha |   (  Updated:2026-01-29 20:47:49  IST  )

UGC తాజాగా "Promotion of Equity in Higher Education Institutions Regulations – 2026" అనే కొత్త నిబంధనలను విడుదల చేసింది.

యూజీసీ కొత్త రూల్స్ మీద జరుగుతున్న వివాదం ఏంటీ?
X

దిశ, వెబ్ డెస్క్ : UGC తాజాగా "Promotion of Equity in Higher Education Institutions Regulations – 2026" అనే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశ్యం.. కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు కులం, మతం, జెండర్, దివ్యాంగత వంటి కారణాలతో ఎలాంటి వివక్ష జరగకుండా చూడటం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఈ కొత్త రూల్స్ ప్రకారం ప్రతి కాలేజ్, యూనివర్సిటీలో తప్పనిసరిగా ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఈక్విటీ కమిటీలు కూడా ఉండాలి. ఎవరికైనా వివక్ష జరిగిందని ఫిర్యాదు వస్తే, దానిని 24 గంటలలోపే దానిపై విచారణ మొదలుపెట్టి పరిష్కారం చూపించాలి అని ఈ నిబంధనలు చెబుతున్నాయి. విద్యార్థులు సులభంగా ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కంప్లైంట్ సిస్టమ్‌లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ కమిటీల్లో SC, ST, OBC, మహిళలు, దివ్యాంగులు (PwD) వారికి సరైన ప్రాతినిధ్యం ఉండాలని కూడా UGC స్పష్టంగా చెప్పింది.

ఎందుకీ కొత్త రూల్స్

అయితే ఈ కొత్త నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారంటే – గతంలో కొన్ని యూనివర్సిటీల్లో జరిగిన కుల వివక్ష ఘటనల వల్ల రోహిత్ వేముల, పయాల్ తాడ్వి వంటి యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గాను, విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం ఉండటానికి, వారికి అన్యాయం జరిగితే వెంటనే న్యాయం దక్కాలి అనే ఉద్దేశంతోనే ఈ రూల్స్ తీసుకొచ్చింది UGC.

వివాదం ఎక్కడ మొదలైంది

అయితే ఈ కొత్త రూల్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే పెద్ద వివాదం మొదలైంది. కొంతమంది విద్యార్థి సంఘాలు, మేధావులు అంటున్నదేమిటంటే.. ఈ నిబంధనలు ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ రక్షణ ఇస్తున్నాయని, అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైన హక్కులు లేవని అంటున్నారు. ఫిర్యాదు చేసిన విద్యార్థి మాటనే పూర్తిగా నమ్మితే, ఎదుటివారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. అలాగే ఫేక్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయం ఈ రూల్స్‌లో స్పష్టంగా లేదని విమర్శిస్తున్నారు. దీనివల్ల కాలేజీల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని, టీచర్లు, విద్యార్థులు భయంతో ఉండాల్సి వస్తుందని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఈ రూల్స్ వల్ల కాలేజీల స్వయం ప్రతిపత్తి తగ్గిపోతుందని కూడా అభిప్రాయపడుతున్నారు.

కానీ యూజీసీ కొత్త రూల్స్ వల్ల లాభం పొందే వర్గం మాత్రం ఈ నిబంధనలను గట్టిగా సమర్థిస్తోంది. "ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు మాట్లాడలేక, న్యాయం దొరకక బాధపడ్డారు. ఈ రూల్స్ వల్ల వారికి ఒక వేదిక దొరుకుతుంది" అని అంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఇవి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వివక్ష జరిగితే ఇకపై కాలేజీలు తప్పించుకోలేవని, బాధ్యతతో వ్యవహరించాల్సిందే అని ఈ వర్గం చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా, యూనివర్సిటీల్లో, రాజకీయంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చగా మారింది. కొన్నిచోట్ల నిరసనలు, కొన్నిచోట్ల మద్దతు కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

సుప్రీంకోర్టు స్టే ఎందుకంటే?

ఈ విషయం చివరకు సుప్రీంకోర్టు వరకు చేరింది. ఈ రూల్స్‌లోని కొన్ని నిబంధనలు స్పష్టంగా లేవని, రూల్స్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువని, వెంటనే ఈ రూల్స్ రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ ల్లో పేర్కొనగా.. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం ఈ నిబంధనలను తాత్కాలికంగా అమలు చేయొద్దని స్టే విధించింది. అందులో కొన్ని రూల్స్ ఎలా అమలు చేయాలి, ఎవరి మీద ఎలా చర్యలు తీసుకుంటారు అనే విషయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు రావచ్చని. అందుకే ఈ మొత్తం అంశాన్ని లోతుగా, పూర్తిగా పరిశీలించాలనుకుంటున్నామని కోర్టు తెలిపింది. మొత్తం మీద UGC కొత్త రూల్స్ వెనుకబడిన విద్యార్థుల భద్రత కోసం ప్రవేశపెట్టినప్పటికీ.. అవి అమలవుతాయా లేదా? అందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.

Next Story