- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త సేకరణలో ఒప్పందం పేచీ.. మురికివాడలపై ‘రాంకీ’ వివక్ష..?
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణ విధానంలో జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాలను రాంకీ సంస్థ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణ విధానంలో జీహెచ్‌ఎంసీ అధికారుల ఆదేశాలను రాంకీ సంస్థ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చేసిన కొత్త ప్రతిపాదనలకు ఒప్పందం పేరుతో అంగీకరించడం లేదని ప్రచారం సాగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్యం (Sanitation)పై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారులే దీనికి బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 'డోర్ టు డోర్' చెత్త సేకరణ వ్యవస్థలో మ్యాన్‌పవర్, వాహనాల వినియోగం, రూట్ ఆప్టిమైజేషన్, వేర్వేరుగా చెత్త విభజన చేసే అంశాల్లో మార్పులు చేయాలని జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. అయితే ఇవి తమతో కుదిరిన ఒప్పందానికి విరుద్ధమని, తమపై అదనపు భారం మోపే విధంగా ఉన్నాయని రాంకీ వాదిస్తోంది. ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థలో మార్పులకు రాంకీ సంస్థ నిరాకరించడం వెనుక, ఆ సంస్థ ఒప్పంద వైఫల్యాలే కారణమా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మురికివాడలపై వివక్ష..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 5 వేల మురికివాడలు ఉండగా, అక్కడ చెత్త సేకరణ ప్రశ్నార్థకంగా మారింది. స్వచ్ఛ ఆటోలు కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇతర ప్రాంతాల్లో మాత్రమే చెత్తను సేకరిస్తున్నాయి. మురికివాడల్లో నివసించే వారు ఫీజు చెల్లించడం లేదని అక్కడికి చెత్త సేకరణకు రావడం లేదు. దీంతో రోడ్లపై 'గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్' (GVP) పెరుగుతున్నాయి.
స్వచ్ఛ ఆటోలే కీలకం..
గ్రేటర్‌లో ఇంటింటి చెత్త సేకరణలో స్వచ్ఛ ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ అనేక డివిజన్లలో 20 నుంచి 30 శాతం స్వచ్ఛ ఆటోలు నడవని పరిస్థితి ఉంది. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నవి 65 నుంచి 70 శాతం మాత్రమే. జీపీఎస్, ట్రిప్ లాగ్ తప్పనిసరి అయినప్పటికీ 25 శాతానికి పైగా స్వచ్ఛ ఆటోలకు డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు. 2024–25లో నమోదైన పారిశుధ్య ఫిర్యాదుల్లో 35 నుంచి 40 శాతం ఫిర్యాదులు నేరుగా స్వచ్ఛ ఆటోల ఆలస్యం, అసలు రాకపోవడంపైనే ఉన్నాయి.
ప్రస్తుత వ్యవస్థలో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగకపోవడం, సర్కిళ్ల వారీగా వాహనాల కొరత, పారిశుధ్య కార్మికుల సంఖ్య ఒప్పందానికి తగ్గట్టు లేకపోవడం వంటి అంశాలు ఏళ్లుగా జీహెచ్‌ఎంసీని పట్టిపీడిస్తున్నాయి. ఇంటింటి చెత్త సేకరణలో రూట్ రేషనలైజేషన్, మ్యాన్‌పవర్ రీడిప్లాయ్‌మెంట్, పనితీరు ఆధారిత పేమెంట్ మోడల్ అమలు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ ఇవి అమలైతే తమ వైఫల్యాలు అధికారికంగా రికార్డవుతాయన్న భయంతోనే రాంకీ వెనక్కి తగ్గుతోందన్న వాదన వినిపిస్తోంది.






