పేదోళ్ల పై కక్షసాధింపా ?

by Batti.Sumithra |

వారంతా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే వేతనం పొందే బడుగు జీవులు.

పేదోళ్ల పై కక్షసాధింపా ?
X

దిశ, కొత్తగూడెం : వారంతా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే వేతనం పొందే బడుగు జీవులు. అయినప్పటికీ చిన్న ఉద్యోగమని కుంగిపోకుండా తమ విధులను నిర్వర్తిస్తూ, పైసా పైసా పొదుపు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత ఐదేళ్లుగా ఎస్సీ వెల్ఫేర్ శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ అదే ఉద్యోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే, ఆకస్మికంగా జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి శ్రీలత మౌఖిక ఆదేశాలతో బదిలీలు చేయడంతో 10 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా స్థానిక హాస్టళ్లలో పనిచేస్తున్న వీరిని 40 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు బదిలీ చేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

తమకు వచ్చే రూ.5 వేల నుంచి రూ.10 వేల జీతంతో దూర ప్రాంతాలకు వెళ్లి అద్దె ఇల్లు తీసుకుని కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఉద్యోగులు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. "ఇష్టం లేకపోతే మానేయండి" అంటూ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి శ్రీలత కరాఖండిగా చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఆరుగురు డీఎస్సీడీవోలు విధులు నిర్వహించినప్పటికీ, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న శ్రీలత హయాంలోనే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని పలు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

వాళ్లంతట వాళ్లే ఉద్యోగం మానేసేలా 10 మంది బదిలీ..

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ.40 వేల నుంచి లక్షల రూపాయల వరకు వేతనాలు ఉంటాయి. బదిలీల కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లినా కుటుంబంతో కలిసి నివసిస్తూ ఇంటి అద్దె, పిల్లల చదువు, సామాన్ల తరలింపు వంటి ఖర్చులను భరించే స్థోమత వారికి ఉంటుంది. అయితే, రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే వేతనం పొందే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు దూర ప్రాంతాల్లో పనిచేయడం, కుటుంబాన్ని పోషించడం సాధ్యం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బదిలీ అయిన 10 మందిలో నలుగురు విధులకు హాజరుకావడం మానేశారు. మరికొందరు ఉద్యోగం కోల్పోతామనే భయంతో ఇష్టంలేకపోయినా దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే దూర ప్రాంతాలకు బదిలీ చేసి, వారంతట వారే ఉద్యోగాలు మానేసేలా చేసి, అనంతరం తమకు అనుకూలమైన వారిని నియమించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ప్రస్తుతం పనిచేస్తున్న హాస్టళ్లలోనే కొనసాగించేలా అవకాశం ఇవ్వాలని కన్నీటి పర్యంతమై వేడుకున్నప్పటికీ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ వెల్ఫేర్‌లో మౌఖిక బదిలీల పేరుతో వేధింపులు..

బదిలీ అయిన 10 మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వివిధ ఏజెన్సీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం సంబంధిత శాఖ ద్వారా ఏజెన్సీలకు వేతనాలు చెల్లిస్తుంది. ఆ ఏజెన్సీలు తమ ఆధ్వర్యంలోని ఉద్యోగులకు జీతాలు అందజేస్తాయి. ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వహించకపోతే సంబంధిత ఏజెన్సీలను పిలిపించి హెచ్చరించడం లేదా వారి ద్వారా బదిలీలు చేయించడం ఆనవాయితీ. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఎస్సీడీవో స్వయంగా జోక్యం చేసుకుని మౌఖిక ఆదేశాలతో 10 మందిని బదిలీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకే ఈ చర్యలు చేపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. "ఇష్టం లేకపోతే మానేయండి" అంటూ అధికారిణి పలుమార్లు ఉద్యోగులతో చెప్పినట్లు సమాచారం. దీనివల్ల బదిలీలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించని అధికారిణి..

కన్నీళ్లు పెట్టుకుని వేడుకున్నప్పటికీ, "ఇష్టముంటే చేయండి, లేకపోతే మానేయండి" అంటూ జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి పలుమార్లు స్పందించడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోందని వారు అంటున్నారు. మణుగూరు హాస్టల్‌లో పనిచేస్తున్న ఓ గిరిజన మహిళను రామవరం బాయ్స్ హాస్టల్‌కు బదిలీ చేశారు. పాల్వంచ గర్ల్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఓ మహిళను పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ బాయ్స్ హాస్టల్‌లో వాచ్‌మన్‌గా నియమించారు. తాను మహిళనని, కళాశాల విద్యార్థులు ఉండే బాయ్స్ హాస్టల్‌లో విధులు నిర్వహించడం ఇబ్బందికరమని ఆమె మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. బూర్గం పాడు బాయ్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న మహిళా కుక్‌ను ఇల్లందు బాయ్స్ హాస్టల్‌కు వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. చంద్రుగొండ బాయ్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్‌ను ములకలపల్లికి బదిలీ చేశారు. ప్రస్తుతం చంద్రుగొండలో వాచ్‌మన్ లేకపోయినా తప్పనిసరిగా ములకలపల్లికే వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. చుంచుపల్లి ప్రీమెట్రిక్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఉద్యోగినిని పాల్వంచకు బదిలీ చేశారు.

ఇలా కారణం లేకుండా ఒకచోట పనిచేస్తున్న వారిని మరోచోటికి బదిలీ చేసి తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ, వారంతట వారే ఉద్యోగాలు మానేసే పరిస్థితి కల్పిస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంలో సీపీఐ, న్యూ డెమోక్రసీ నాయకులు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెంలో ఐఎఫ్‌టీయూ (IFTU) నాయకులు సమావేశం నిర్వహించి, డీఎస్సీడీవో వైఖరి మారకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ అంశం పై జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి శ్రీలతను వివరణ కోరగా, తనకు ఎవరి పైనా వ్యక్తిగత కక్ష లేదని తెలిపారు. హాస్టళ్లలో పనులు సక్రమంగా సాగాలనే ఉద్దేశంతోనే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేశామని చెప్పారు. పని అవసరం ఉన్నవాళ్లు చేస్తారు. అవసరం లేని వాళ్లు మానేయవచ్చు అని ఆమె వ్యాఖ్యానించారు. కొందరు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు హాస్టళ్లలో ఫోటోలు తీసి ఇతరులకు పంపిస్తూ శాఖ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని, అందుకే ఈ 10 మందిలో కొంతమందిని బదిలీ చేశామని ఆమె వివరించారు.

Next Story