ఎల్ నినోపై నిరంతర నిఘా.. రైతు సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్!

by Malleboina Mahesh |   (  Updated:2026-06-20 13:41:17  IST  )

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో ప్రభావంపై కేంద్రం నిఘా.. నీటి సంక్షేమం, రైతు సంక్షేమానికి మోడీప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్!

ఎల్ నినోపై నిరంతర నిఘా.. రైతు సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్ నినో (El Nino) ప్రభావంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) కీలక ప్రకటన చేశారు. ఎల్ నినో వల్ల తలెత్తే నీటి కొరత, వాతావరణ మార్పులపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ముంబైలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఎల్ నినో అనేది ప్రపంచవ్యాప్త సంక్షోభమని, దీనిపై తాము నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో నీటి సంక్షోభం తలెత్తితే, దానిని అధిగమించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

రైతు సంక్షేమమే అత్యంత ప్రాధాన్యత

బీజేపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమమే అత్యంత ప్రాధాన్యత అని, గత యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము కనీస మద్దతు ధర (MSP) కింద 3 రెట్లు ఎక్కువ పరిమాణంలో పంటలను సేకరించామని మంత్రి వెల్లడించారు. గత పన్నెండేళ్లలో ఎమ్‌ఎస్‌పీ ధరలను రికార్డు స్థాయిలో పెంచామని, రైతులు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా కేంద్రం వెనువెంటనే స్పందించిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఎరువుల ధరలు ఒక్కో బస్తాకు రూ. 3,000 వరకు చేరినప్పటికీ, ఆ భారాన్ని రైతులపై పడకుండా కేంద్ర బడ్జెట్‌లోనే దాదాపు 90 శాతం వరకు సబ్సిడీని భరించిందని పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలపై కానీ, రైతులపై గానీ ఎలాంటి ఆర్థిక భారం పడలేదని, 12 ఏళ్ల క్రితం ఉన్న ధరలకే నేడు రైతులకు ఎరువులు అందుతున్నాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు.

Next Story