రైతులకు కేంద్రం తీపికబురు: పీఎం-కిసాన్ 23వ విడత నిధులు విడుదల

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు.

రైతులకు కేంద్రం తీపికబురు: పీఎం-కిసాన్ 23వ విడత నిధులు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. శనివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ విడతలో ఒక్కో అర్హ రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ కాగా, దేశ వ్యాప్తంగా సుమారు 9.44 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతలుగా మొత్తం రూ.6 వేల ఆర్థిక సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది.

జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

పీఎం-కిసాన్ నిధులు పొందే రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో అధికారిక పోర్టల్‌లో తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం పీఎం-కిసాన్ pmkisan.gov.in వెబ్‌సైట్‌లోని ‘ఫార్మర్ కార్నర్’ విభాగంలోకి వెళ్లి ‘బెనిఫిషియరీ లిస్ట్’ ఎంపికను క్లిక్ చేయాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను నమోదు చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అలాగే ఇ-కేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నిధులు జమ కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు అదే పోర్టల్‌లోని ‘ఇ-కేవైసీ’ ఆప్షన్ ద్వారా ఆధార్ నెంబర్, ఓటీపీ సాయంతో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. దీంతో భవిష్యత్తులో నిధుల జమలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story