- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూరో సర్జరీల విజయవంతంలో అనస్థీషియా వైద్యుల పాత్రే కీలకం: రాహుల్ దేవరాజ్
నిమ్స్‌లో 'న్యూరో అనెస్కాన్ 2026' సదస్సు ప్రారంభం.. మెదడు శస్త్రచికిత్సల్లో అనస్థీషియా వైద్యులదే కీలక పాత్ర అన్న డైరెక్టర్ రాహుల్ దేవరాజ్!

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూరో సర్జరీల విజయవంతమైన నిర్వహణలో న్యూరో-అనస్థీషియా వైద్యుల పాత్ర అత్యంత కీలకమని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. మెదడు నిర్మాణం, నాడీ వ్యవస్థ పనితీరు పై సమగ్ర అవగాహన కలిగి ఉండటం ద్వారానే రోగులకు మరింత సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించగలమని ఆయన స్పష్టం చేశారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అనస్థీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘న్యూరో అనాటమీ ఫ్రం ద లెన్స్ ఆఫ్ ద న్యూరో- అనస్థీటిస్ట్’ అనే అంశంపై నిర్వహించనున్న నిమ్స్ న్యూరో అనెస్కాన్ 2026 రెండు రోజుల ప్రత్యేక శిక్షణా సదస్సు శనివారం నిమ్స్ ఎమర్జెన్సీ భవనం, ట్రామా ఆడిటోరియంలో ప్రారంభమైంది.
న్యూరోఅనాటమీపై ప్రాయోగిక శిక్షణ అందించే ఇటువంటి కార్యక్రమాలు వైద్యులు, పీజీ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. న్యూరో-అనస్థీషియా వైద్యుల దృక్కోణంలో మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణం, దాని క్లినికల్ ప్రాధాన్యత పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ డా. పి.చంద్రశేఖర్, అనస్థీషియాలజీ విభాగాధిపతి డా. శ్రీలత మొనింగి, డా. సప్నా ఏ. నిఖార్, డా. పద్మజ దుర్గ, సైంటిఫిక్ కమిటీ సభ్యులు డా. అబినాష్ పాత్రో, డా. రామనాథ్, డా. కె. శివప్రియ, డా. ప్రాచి శర్మ, రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నుంచి అనస్థీషియాలజిస్టులు, పీజీ విద్యార్థులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
లైవ్ డెమాన్‌స్ట్రేషన్..
రెండు రోజుల సదస్సులో మెదడు నిర్మాణం, సుప్రాటెంటోరియల్, ఇన్‌ఫ్రాటెంటోరియల్ భాగాలు, మెదడుకు రక్త సరఫరా వ్యవస్థ, న్యూరోఅనాటమీకి సంబంధించిన అంశాలపై నిపుణులు ఉపన్యాసాలు ఇచ్చారు. అనంతరం వెట్ డిసెక్షన్, లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా పాల్గొనేవారికి ప్రత్యక్ష శిక్షణ అందించారు. అలాగే సీటీ, ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా న్యూరో రేడియాలజీ అంశాలపై చర్చలు నిర్వహించారు. వివిధ న్యూరో సర్జికల్ కేసులపై కేస్ బేస్డ్ డిస్కషన్స్, ఇంట్రాక్రానియల్ అన్యూరిజమ్ తదితర అంశాలపై నిపుణుల చర్చలు, వర్క్‌షాప్ అనంతరం క్విజ్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






