- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లీక్ డిటెక్షన్ అధ్యయనం పరిశ్రమలకు భద్రతా కవచం.. పీసీబీ ఆధ్వర్యంలో నిపుణులతో కీలక సమావేశం
లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ (ఎల్‌డిఏఆర్) అధ్యయనం ప్రాముఖ్యత, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శనివారం నిపుణులతో సమావేశం నిర్వహించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ (ఎల్‌డిఏఆర్) అధ్యయనం ప్రాముఖ్యత, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) శనివారం నిపుణులతో సమావేశం నిర్వహించింది. పీసీబీ మెంబర్ సెక్రటరీ జి. రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్, పారిశ్రామిక నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్ అధ్యయనం అవసరం, పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాలకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ నిపుణులు ఎల్‌డిఏఆర్ అధ్యయనం, భద్రతా అంశాలపై రూపొందించిన నివేదికను సమావేశంలో సమర్పించారు. ప్రమాదాలను తగ్గించేందుకు అనుసరించాల్సిన చర్యలను వివరించారు.
ప్రతి పరిశ్రమలో అర్హత కలిగిన సిబ్బంది అందుబాటులో ఉండాలని, రసాయనాల నిర్వహణ, లీకేజీల గుర్తింపు, వాతావరణంలోకి చేరే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (వీఓసీలు) ప్రభావాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ప్రతినిధి ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, కన్సల్టెంట్లు, పీసీబీ అధికారులు ఎల్‌డిఏఆర్ అధ్యయనం ప్రాముఖ్యతతో పాటు పరిశ్రమల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యల అమలు అత్యంత అవసరమని సమావేశంలో నొక్కిచెప్పారు.






