బుక్ చేసి 5 రోజులైనా రాని గ్యాస్.. సంస్థాన్ నారాయణపురంలో వినియోగదారుల అవస్థలు!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఎక్కడా లేని గ్యాస్ కొరత కేవలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహ భారత్ గ్యాస్ ఏజెన్సీలోనే కొనసాగుతోంది.

బుక్ చేసి 5 రోజులైనా రాని గ్యాస్.. సంస్థాన్ నారాయణపురంలో వినియోగదారుల అవస్థలు!
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: రాష్ట్రంలో ఎక్కడా లేని గ్యాస్ కొరత కేవలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహ భారత్ గ్యాస్ ఏజెన్సీలోనే కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాలుగా గ్యాస్ కోసం మండల పరిధిలోని ప్రజలతో పాటు సదరు ఏజెన్సీలో కనెక్షన్ ఉన్న కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.ఇరాన్-అమెరికా యుద్ధం సాకు చూపి కొన్ని రోజులు ఏజెన్సీ నిర్వాహకులు కస్టమర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

గ్యాస్ బుక్ చేసిన నో డెలివరీ..

లక్ష్మీనరసింహ గ్యాస్ ఏజెన్సీలో ఐదు రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసుకున్న డెలివరీ చేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కస్టమర్ ఏజెన్సీ వద్దకు వచ్చి గ్యాస్ సిలిండర్ కోసం అడిగిన బుక్ చేసిన వెంటనే రాదని రెండు రోజుల తర్వాత రావాలని సూచించారు. రెండు రోజుల తర్వాత కస్టమర్ మళ్ళీ వెళ్తే నేడు గ్యాస్ స్టాక్ లేదని చెప్పారు. ఇలా ఒక్కో కస్టమర్లను రెండు నుంచి మూడు సార్లకు పైగా ఏజెన్సీ చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తీరా వారం గడిచాక మొదట బుక్ చేసుకున్న బుకింగ్ క్యాన్సిల్ అయింది అని తిరిగి బుక్ చేసుకోవాలంటూ లైన్ లో నిలబడ్డ తర్వాత కస్టమర్లకు సూచిస్తున్నారు. ఇక్కడ గ్యాస్ కోసం కస్టమర్లు యుద్ధమే చేయాల్సి రావడం కస్టమర్లను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. గతంలో ఇక్కడ తోపులాటలో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన ఇంకా గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో మాత్రం మార్పు రావడం లేదు.

బ్లాక్ మార్కెట్‌కు తరులుతున్నాయని ఆరోపణలు!

సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లు తమకు నచ్చిన వారికి ఇష్టానుసారంగా ఇస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివిధ హోటల్,వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారికి గృహ వినియోగ సిలిండర్ లను అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. హోటల్ నిర్వాహకులకు బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్లను ఇస్తూ సామాన్య కస్టమర్లను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇంకా కూడా గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో లోపాలను సవరించుకోకపోవడంతో ప్రస్తుత ఏజెన్సీ ని రద్దుచేసి మరొకరికి ఏజెన్సీ కేటాయించాలంటూ స్థానికులు కోరుకుంటున్నారు.

తూతూ మంత్రంగా అధికారుల చర్యలు!

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ భారత్ గ్యాస్ ఏజెన్సీలో జరుగుతున్న ఇబ్బందుల పై వివిధ పత్రికల్లో కథనాలతో పాటు స్థానికులు ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు తూతూ మంత్రంగా విచారణ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల వరుస కథనాల నేపథ్యంలో సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక ఏం జరిగిందోననే గుసగుసలు మండల వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో లోపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. ఇకనైనా కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇక వేచి చూడాల్సిందే.

Next Story