రోడ్డుపైనే నిర్మాణ సామగ్రి.. బస్తీవాసులకు నరకయాతన

by Ratna Kumari |

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ పరిధి వెంకటేశ్వర కాలనీ ఫేజ్-2, రోడ్ నంబర్-3లో భవన నిర్మాణాల కోసం కంకర, ఇసుక, ఇటుకలు, సిమెంట్ బస్తాలను రోడ్డుపైనే నిల్వ చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డుపైనే నిర్మాణ సామగ్రి.. బస్తీవాసులకు నరకయాతన
X

దిశ, హస్తినాపురం : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ పరిధి వెంకటేశ్వర కాలనీ ఫేజ్-2, రోడ్ నంబర్-3లో భవన నిర్మాణాల కోసం కంకర, ఇసుక, ఇటుకలు, సిమెంట్ బస్తాలను రోడ్డుపైనే నిల్వ చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డును దాదాపు పూర్తిగా ఆక్రమించి నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ సామగ్రి తొలగించాలని కోరితే బిల్డర్లు వాగ్వాదాలకు దిగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గల్లీలోకి రాలేని పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. అలాగే నిర్మాణంలో భాగంగా భవనాలకు క్యూరింగ్ చేస్తున్న నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటంతో రహదారులు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఎల్బీనగర్ జోన్‌లో పర్యటించి రోడ్లపై నిర్మాణ సామగ్రి వేసే వారిపై భారీ జరిమానాలు విధించాలని, అవసరమైతే భవనాలను సీజ్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించినప్పటికీ, ఎల్బీనగర్ సర్కిల్-13 టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హస్తినాపురం, బైరమల్‌గూడ, బీఎన్‌రెడ్డి, వనస్థలిపురం డివిజన్లలో అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story