పవన్ కళ్యాణ్‌కు సర్జరీ విజయవంతం.. మూడున్నర గంటల పాటు శ్రమించిన వైద్యులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-11 05:51:13  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముంబయిలోని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో భుజం శస్త్రచికిత్స సక్సెస్ అయింది.

పవన్ కళ్యాణ్‌కు సర్జరీ విజయవంతం.. మూడున్నర గంటల పాటు శ్రమించిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం అధినేత పవన్ కళ్యాణ్ ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి‌లో శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. గత కొంతకాలంగా తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం ఈ అత్యవసర శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్‌తో ఇబ్బంది..

అయితే, పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ (Rotator Cuff Injuries) ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. భుజం కండరాలు, కీళ్లకు సంబంధించిన ఈ తీవ్రమైన సమస్య కారణంగానే ఆయన గత కొంతకాలంగా నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. పరీక్షల నివేదికలను పరిశీలించిన కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు, దీనికి శస్త్రచికిత్స ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేయడంతో పవన్ కళ్యాణ్ సర్జరీకి మొగ్గు చూపారు. వైద్యుల షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ ఉదయం కోకిలాబెన్ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ ప్రారంభమైంది.

దాదాపు మూడున్నర గంటల పాటు పవన్‌కు శస్త్రచికిత్స సుదీర్ఘంగా సాగింది. అయితే, రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స నిర్వహిస్తే సర్జరీ తర్వాత నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అది ఆయనకు భరించడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో, వైద్య నిబంధనల ప్రకారం పవన్‌కు ఇవాళ కేవలం ఒకే భుజానికి మాత్రమే శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. రెండో భుజానికి మరో రెండు నెలల వ్యవధి తర్వాత శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు.

Next Story