- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢాకా వేదికగా భారత దౌత్యవేత్త తెగువ: తప్పుడు ఇండియా మ్యాప్‌పై తీవ్ర అభ్యంతరం (వీడియో)
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన సార్క్ సదస్సులో భారతదేశ తప్పుడు మ్యాప్‌పై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢాకాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత దౌత్యవేత్త పూజా కుమారి (Puja Kumari) తెగువను ప్రదర్శించారు. సదస్సులో భారతదేశానికి సంబంధించిన తప్పుడు మ్యాప్‌ను ప్రదర్శించడంపై ఆమె వేదికపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ భారతదేశంలో విడదీయరాని, అంతర్భాగమని ఆమె ప్రపంచ దేశాల ప్రతినిధుల సమక్షంలో నిర్వాహకులను ఉతికారేశారు.
అసలు ఏం జరిగిందంటే..
బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS) ఆధ్వర్యంలో ఢాకాలో సార్క్ పునరుద్ధరణ మార్గాలు(SAARC) అనే అంశంపై ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్యామా ఒబైద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, 2009 నుంచి 2014 వరకు భారతలో బంగ్లాదేశ్ హైకమిషనర్‌గా పనిచేసిన అహ్మద్ తారిఖ్ కరీం ఈ సదస్సులో ప్రజెంటేషన్ ఇస్తూ ఓ మ్యాప్‌ను ప్రదర్శించారు. అందులో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు. దీంతో భారత హైకమిషన్ సెకండ్ సెక్రటరీ పూజా కుమారి ఝా వెంటనే రియాక్ట్ అయ్యారు. అహ్మద్ తారిఖ్ కరీం ప్రసంగిస్తుండగానే ఆమె మధ్యలో లేచి ‘మీరు ప్రదర్శించిన భారతదేశ పటం తప్పుగా ఉంది. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగం’అని స్పష్టం చేశారు. అందుకు అహ్మద్ తారిఖ్ కరీం సర్దిచెబుతూ.. ‘ఈ మ్యాప్ కేవలం ప్రాతినిధ్య ప్రయోజనాల కోసమే ఉపయోగించామని, వాస్తవ సరిహద్దులను ఇది సూచించదని’ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
నెటిజన్ల ప్రశంసలు..
అయినా.. పూజ కుమారి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘సార్, మీ వివరణ నాకు అర్థమైంది.. కానీ జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఇక్కడ అది తప్పుగా చూపించబడింది. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడానికే నేను అభ్యంతరం తెలిపాను’ అని గట్టిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం అందుకు సంబధించిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






